కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకుంటే ఎవరికీ చెప్పుకునే పరిస్థితి ఉండదని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చెప్పారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకుంటే ఎవరికీ చెప్పుకునే పరిస్థితి ఉండదని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి కన్నా తానేమీ తీసిపోలేదని వ్యాఖ్యానించారు. మింట్ కాంపౌండ్‌లో ఆంధ్రప్రదేవ్ ఎలక్ట్రిసిటి బోర్డు ఎస్సీ వెల్‌ఫేర్ అసోషియేషన్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి సర్వే శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌లో టికెట్లు ఇచ్చే ప్రక్రియ ఆఖరి వరకూ కొనసాగుతుందని, టికెట్ రాకపోయినా ఎవరికీ చెప్పుకునే అవకాశం కూడా ఉండబోదన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరుతున్న చిరంజీవి.. 18 శాతం ఓటర్లును పక్కన పెట్టి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన గొప్ప త్యాగజీవి అని వ్యంగ్యాస్త్రం సంధించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం ఖాయమని, ఈ దిశగా సోనియా కృషి చేస్తోందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌లోని సీమాంధ్రుల ఆస్తుల రక్షణ కోసం ఎలాంటి త్యాగానికైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. 15 ఏళ్లుగా రోడ్డు మీద తిరుగుతున్న తనను సోనియా ఆదరించి ఇంత వాడిని చేసిందని, ఆమెకు రుణపడి ఉంటానన్నారు. తనను ఓడించేందుకు గతంలో సొంత పార్టీ నేతలే ప్రయత్నించారని, అయినా జనరల్ సీటులో పోటీ చేసి గెలిచానని మంత్రి గుర్తుచేశారు.