
ఏదీ.. పరిశ్రమల జాడ
విశాఖలో పారిశ్రామిక రంగం ఉరకలేస్తుందని పాలకులు కొద్ది నెలలుగా చెబుతున్నారు.
విశాఖపట్నం: విశాఖలో పారిశ్రామిక రంగం ఉరకలేస్తుందని పాలకులు కొద్ది నెలలుగా చెబుతున్నారు. దేశ, విదేశీ సంస్థలు క్యూ కడుతున్నాయని గొప్పలు చెబుతున్నారు.. తాజాగా ప్రభుత్వ రంగంలోని మినీరత్న సంస్థ బాల్మర్ లారీ దాదాపు రూ.220 కోట్ల పెట్టుబడితో మల్టీమోడల్ లాజస్టిక్ హబ్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. అయితే ఇంతవరకూ హడావిడే తప్ప ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు దిశగా అడుగులు పడిన దాఖలా లేదు. ఒప్పంద పత్రాల తర్వాత ఆయా సంస్థలూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
ప్రచారానికే పరిమితం: రాష్ట్ర ఆర్ధిక ప్రగతికి పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముందనడం నిస్సందేహం. అయితే ఇందుకు భారీగా మలిక సదుపాయాలు అవసరం. ఒప్పందాలపై చూపిస్తున్న ఆసక్తి మౌలిక సదుపాయలపై చూపడం లేదనే విమర్శ పారిశ్రామిక వర్గల నుంచి వినిపిస్తున విమర్శ. సింగిల్ విండో విధానంలో 21 రోజుల్లో అనుమతులు ఇచ్చేస్తామని చెప్పడం మినహా పరిశ్రమల స్థాపనకు ముందకు వస్తున్న వారికి ఎలాంటి సాయం చేయడం లేదు. ముఖ్యంగా భూములు సమకూర్చే విషయంలోనే తొలి అడ్డంకి మొదలవుతోంది. పరిహారం విషయంలో నిర్వాసితులను సంతృప్తి పరచలేకపోవడం వల్ల వారితో పరిశ్రమలకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండటం వల్ల పరిశ్రమల నిర్వహణ కష్టంగా ఉంటోందని ఇటీవల సీఎం చంద్రబాబుకు విశాఖలో పారిశ్రామిక వేత్తలు నిర్మొహమాటంగా చెప్పారు.
అడ్డంకులు తొలగేదెపుడు: ఏషియన్ పెయింట్స్‌కు 125 ఎకరాలను రాంబిల్లి మండలం పూడి వద్ద ఇటీవలే కేటాయించారు. ఇంత వరకూ అక్కడ ప్లాంటుకు సంబంధించి ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. ఏన్టీపీసీ రూ.25 వేల కోట్లతో 1200 ఎకరాల్లో ప్లాంటు నెలకొల్పుతానంటే నిన్నమొన్నటి వరకూ భూమి చూపించలేకపోయారు. అచ్చుతాపురం మండలంలో భూమి ఇచ్చినా నిర్వాసితుల సమస్యను పూర్తిగా పరిష్కరించలేదు. పూడిమడక గ్రామానికి చెందిన మత్స్యకారులు తమ గ్రామం కాలుష్యం కోరల్లో చిక్కకుంటుందనే భయంతో ప్రాజెక్టుకు అడ్డుచెబుతున్నారు.
రాంబిల్లి మండలంలో సోలార్ ఇండస్ట్రీకి దాదాపు 97 ఎకరాలు ఈమధ్యనే ఇచ్చారు. ఇక్కడ ఇవ్వాల్సిన దానికంటే తక్కువ పరిహారం ఇచ్చారంటూ కొందరు నిర్వాసితులు అసంతృప్తితో ఉండటంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు.ఏపీఐఐసీ చేతిలో ఉన్న 1000 ఎకరాల్లో 500 ఎకరాలను లాజిస్టిక్ పార్క్‌కు, 100 ఎకరాలను ప్యాకేజింగ్ పరిశ్రమకు, 8 ఎకరాలను ప్యాకేజింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు, 98 ఎకరాలను ఎలక్ట్రానిక్స్ మానిఫెక్చరింగ్ క్లస్టర్లకు కేటాయిస్తామన్నారు. ఇంతవరకూ ఆ పని చేయలేదు. అవి రాలేదు. నరవ వద్ద 30-40 ఎకరాలు, నడిపూడి వద్ద 440 ఎకరాలు, కాపులుప్పాడ వద్ద 1350 ఎకరాలు గుర్తించారు. వీటిని ఐటి సంస్థలకు కేటాయిస్తామన్నారు. ఒక్కదానికి కూడా ఇచ్చింది లేదు. సింగపూర్ ఐటి కంపెనీ ఐటి పార్క్‌లో ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని దానికి 6వేల చదరపు అడుగులు కావాలని కోరుతోంది. ఐటి శాఖ 2 వేల అడుగులే అందుబాటులో ఉందని చెబుతోంది. దీంతో ప్రతిపాదన ముందుకు వెళ్లడం లేదు.
ఆశలు రేపిన ప్రకటనలివి: ఏషియన్ పెయింట్స్ దాదాపు 125 ఎకరాల్లో దేశంలోనే అదిపెద్ద ప్లాంట్‌ను విశాఖలో నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. ఏన్టీపీసీ రూ.25 వేల కోట్లతో 1200 ఎకరాల్లో ప్లాంటు నెలకొల్పుతానంటోంది. 500 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్, 100 ఎకరాల్లో ప్యాకేజింగ్ పరిశ్రమ, 8 ఎకరాల్లో ప్యాకేజింగ్ ఇన్‌స్టిట్యూట్, 98 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ మానిఫెక్చరింగ్ క్లస్టర్‌లు రానున్నాయి.ఎలిప్ కంపెనీ అచ్చుతాపురంలో 20-30 ఎకరాలు ఇస్తే ఇండస్ట్రీ పెడతామంటోంది. {ఫెంచ్ దేశానికి చెందిన కెన్యూస్ సంస్థ భవన నిర్మాణంలో వాడే పౌడర్ వంటి పదార్ధాన్ని తయారు చేసే పరిశ్రమ స్థాపించేందుకు ముందుకు వచ్చింది.సింగపూర్ ఐటి కంపెనీ ఐటి పార్క్‌లో ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామంటోంది.చైనీస్ ఇండస్ట్రీయల్ పార్క్‌ను 200 ఎకరాల్లో నెలకొల్పుతామని ఇప్పటికే అక్కడి అధికారుల నుంచి వర్తమానం అందింది.