గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు మృగ్యమయ్యాయి. రోగమొస్తే ‘ప్రైవేటు’ చికిత్సే శరణ్యంగా మారుతోంది. ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు), ఉప కేంద్రాలు చాలా వరకు అలంకారప్రాయంగా మారాయి.
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు మృగ్యమయ్యాయి. రోగమొస్తే ‘ప్రైవేటు’ చికిత్సే శరణ్యంగా మారుతోంది. ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు), ఉప కేంద్రాలు చాలా వరకు అలంకారప్రాయంగా మారాయి.
వాటిలో కనీస సేవలు సైతం అందడం లేదు. వైద్యులు ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు పీహెచ్‌సీలలో వైద్యులుండాలి. ఈ సమయ పాలనను చాలా మంది పాటించడం లేదు. వారి కోసం ఎదురుచూసే ఓపిక లేక, రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. ఇక పాముకాటు, పాయిజన్, విష జ్వరాలు తదితర సీరియస్ కేసులకు ప్రాథమిక చికిత్స కూడా చేయడం లేదు. సిబ్బంది కొరత, సౌకర్యాల లేమి వంటి కారణాలు కూడా గ్రామీణులకు ప్రభుత్వ వైద్య సేవలను దూరం చేస్తున్నాయి. జిల్లాలో 80 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇందులో 24 గంటలూ పనిచేసేవి 24 ఉన్నాయి. వీటికి 185 వైద్యుల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం 96 మంది రెగ్యులర్, 74 మంది కాంట్రాక్టు వైద్యులున్నారు.
ఇంకా 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా, రెగ్యులర్ వైద్యుల్లో 22 మంది పీజీ కోసం వెళ్లారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలకు లోటు ఏర్పడుతోంది. విడపనకల్లు, ముద్దినాయనిపల్లి, బ్రహ్మసముద్రం, శెట్టూరు, గరుడచేడు, పాముదుర్తి, రెడ్డిపల్లి పీహెచ్‌సీల్లో ఒక్క వైద్యుడూ లేకపోవడం గమనార్హం. ఇక 24 గంటలూ పనిచేసే పీహెచ్‌సీలలో ఒక్క వైద్యుడు కూడా రాత్రి వేళల్లో ఉండడం లేదు. దీంతో డెలివరీ కేసులను పట్టణాలకు తీసుకెళ్లాల్సి వస్తోంది. పీహెచ్‌సీలు, ఉప కేంద్రాల్లో వైద్య సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. దీని కారణంగా జననీ సురక్ష యోజన, జేఎస్‌కే పథకాలు, మదర్ చైల్డ్ ట్రాక్ సిస్టమ్‌లో పేర్ల నమోదు, గర్భిణులకు సూచనలు, మందుల పంపిణీ వంటి వాటిలో జాప్యం జరుగుతోంది.
సొంత భవనాల కొరత
జిల్లా వ్యాప్తంగా 80 పీహెచ్‌సీలు, 586 ఉప కేంద్రాలు ఉన్నాయి. 68 పీహెచ్‌సీలకు మాత్రమే పక్కాభవనాలున్నాయి. 12 పీహెచ్‌సీలకు ఇంకా నిర్మించడంలోనే ఉన్నారు. నీలకంఠాపురం, ముద్దినాయనపల్లి, బత్తలపల్లి, కదిరేపల్లి, ఎద్దులపల్లి, ఆవులదట్ల, గుట్టూరు, రెడ్డిపల్లి, గరుడచేడు, కొక్కంటి, హేమవతి, శ్రీధర్‌గట్ట పీహెచ్‌సీలు అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల నడుమ నడుస్తున్నాయి. ఇక 586 ఆరోగ్య ఉప కేంద్రాల్లో 282 కేంద్రాలకు సొంత భవనాలున్నాయి. ప్రస్తుతం 58 భవనాలు నిర్మాణదశలో ఉన్నాయి. ఇంకా 246 కేంద్రాలకు నిర్మించాల్సివుంది.
నేలపైనే వైద్యం
పీహెచ్‌సీల్లో కేటాయించిన మేరకు పడకలు సైతం లేవు. కటిక నేలపైనే వైద్యం అందించే పరిస్థితి దాపురిస్తోంది. వాస్తవానికి ఆరు నుంచి పది పడకలుండాలి. చాలాచోట్ల నాలుగు కూడా లేవు. విధిలేక రోగులను నేలపై పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు.
మందులు తీసుకెళ్లడంలో జాప్యం
అనంతపురంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో మందులు పుష్కలంగా ఉన్నా, వాటిని తీసుకుపోవడంలో పీహెచ్‌సీల ఫార్మసిస్టులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో మందులు అందుబాటులో లేక వైద్యులు బయటకు రాస్తున్నారు. గత్యంతరం లేక అప్పోసప్పో చేసి మందులు కొనాల్సి వస్తోంది.
ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు
పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉప కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తాం. వైద్య సేవలు అందడం లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తప్పవు. గతంలో ఎంతో మంది వైద్యులకుషోకాజ్ నోటీసులిచ్చాం. పేదలకు వైద్యం అందించడంలో జాప్యం చేయరాదు.
- డాక్టర్ రామసుబ్బారావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ