ఇన్ఫార్మర్ అనే ముద్ర వేసి మావోయిస్టులు ఓ గిరిజనుడిని హతమార్చారు. దాంతో ఆగ్రహించిన గ్రామస్థులు మావోయిస్టులపై ఎదురుదాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఈ సంఘటన విశాఖ జిల్లా ఏజెన్సీ పరిధిలోని చింతపల్లి మండలం కోరుకొండలో జరిగింది. కొత్తగా పెళ్లయిన ఓ గిరిజన యువకుడిని ప్రజాకోర్టులో ఇన్ఫార్మర్ అని మావోయస్టులు ముద్ర వేశారు. అయితే అతడిని చంపొద్దని గ్రామస్థులు వేడుకున్నా, మావోయిస్టులు వినిపించుకోకుండా అతడిని చంపేశారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గిరిజనులు.. రాళ్లతో కొట్టి ముగ్గురు మావోయిస్టులను చంపేశారు. మృతుల్లో డీసీఎం స్థాయి నేత కూడా ఒకరున్నారు. ఏకే 47 సహా మరికొన్ని ఆయుధాలు సంఘటన స్థలంలో లభించాయి.
ఇటీవలి కాలంలో ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతం (ఏవోబీ)లో మావోయిస్టుల కదలికలు కొంత వరకు తగ్గుముఖం పట్టాయి. అందులోనూ, హుదూద్ తుఫానుతో ఈ ప్రాంతం అంతా అల్లకల్లోలంగా మారడంతో.. మావోయిస్టులు కూడా పెద్దగా ఎలాంటి కార్యకలాపాలు చేయట్లేదు. అయితే ఉన్నట్టుండి ఓ గిరిజనుడిని వాళ్లు హతమార్చడంతో.. గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గ్రామస్థులు ఇలా దాడి చేయడం, వారి దాడిలో మావోయిస్టులు మరణించడం లాంటి సంఘటనలు ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేవు.