లారీ బోల్తా..ముగ్గురికి తీవ్ర గాయాలు
గిద్దలూరు: లారీ బోల్తాపడి కర్ణాటక రాష్ట్రం సింధనూరుకు చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన నగర పంచాయతీ పరిధిలోని ఏసీ గోడౌన్ సమీపంలో నంద్యాల-ఒంగోలు రహదారిపై గురువారం జరిగింది. క్షతగాత్రులు తెలిపిన వివరాల మేరకు కాకినాడలో వరి కోతలు పూర్తి చేసుకుని వరికోత యంత్రాన్ని లారీలో ఎక్కించుకుని నంద్యాలకు వెళ్తుండగా..రంగారెడ్డిపల్లె దాటాక లారీ డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు.
దీంతో లారీ అదుపు తప్పి కుడివైపున్న చెట్లను ఢీకొనబోయింది. డ్రైవర్ పక్కనే కూర్చుని ఉన్న యంత్రం ఓనరు హనుమంతు లారీ స్టీరింగ్‌ను ఎడమవైపునకు తిప్పడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈఘటనలో హనుమంతుతో పాటు డ్రైవర్ గోవిందా అధికారి, వరికోత యంత్రం ఆపరేటర్ ఆనంద్ మండల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ఏరియా వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.