కొడవలూరు: ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య ఆయన స్వగ్రామాన్ని దత్తత తీసుకుని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయలనుకోవడం ప్రశంసనీయమని, ఆయన స్ఫూర్తితో తన స్వగ్రామమైన తోటపల్లిగూడూరును దత్తత తీసుకుని ఆయనతో పోటీపడి అభివృద్ధి చేస్తానని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. మండలంలోని వెంకన్నపురంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధి శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వగ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కృష్ణయ్య అద్భుతమైన ప్రణాళిక రూపొందించారన్నారు.
టీపీగూడూరును కూడా కృష్ణయ్య సూచనలు, సలహాల మేరకే అభివృద్ధి చేస్తానన్నారు. జిల్లాలో ఉన్న గ్రామాల్లో తొంబై శాతం గ్రామాలను దత్తత తీసుకొనేలా చేయడం బాధ్యతగా పెట్టుకొన్నట్లు తెలిపారు. దత్తత తీసుకొన్న గ్రామాలకు సొంత నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వ పథకాలు గ్రామంలో వంద శాతం అమలయ్యేలా చేస్తే చాలన్నారు.
దత్తత తీసుకొన్న గ్రామ అభివృద్ధికి కృష్ణయ్య అనుసరిస్తున్న విధానం అందరికీ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమానికి ఆయనను అంబాసిడర్‌గా పెట్టుకుంటామన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగపూర్, జపాన్‌ల నుంచి పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారని తెలిపారు. జిల్లాలో పోర్టు ఉండడమే ఇందుకు కారణమని చెప్పారు. సీఎం సహకారంతో జిల్లాను పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
సుగ్రామంలో మంచి మనుషులుండాలి
ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రతిఒక్కరూ గ్రామాభివృద్ధికి తమవంతు సహకారం అందించినపుడే ఏ గ్రామమైనా సుగ్రామమవుతుందన్నారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో వసతులు దుర్భరంగా ఉన్నాయన్నారు. నిర్వహణ లోపంతోనే ఈ దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసేలా మంత్రి కృషి చేయాలని కోరారు.
రూ.2 కోట్ల జెడ్పీ నిధులతో జిల్లాలోని 50 పాఠశాలల్లో వసతులు మెరుగు పరుస్తున్నట్లు తెలిపారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్ ఎం.జానకి, ఎమ్మెల్యేలు పి.శ్రీనివాసులురెడ్డి, కె.రామకృష్ణ, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభాహైమావతి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దుర్గాప్రసాదరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మాట్లాడారు. అభివృద్ధికి శ్రీకారం
కొడవలూరు: వెంకన్నపురాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించక ముందు నుంచే కృష్ణయ్య పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందుకోసం ఒక ప్రణాళిక రూపొందించారు. రైతుల ధాన్యాన్ని కోసిన వెంటనే అమ్ముకోకుండా గోదాముల్లో భద్రపరచుకుని మంచి ధర వచ్చినపుడు అమ్ముకునేలా చేసేందుకు గ్రామంలో గిడ్డంగుల నిర్మాణానికి కృషిచేస్తున్నారు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసి పాల ఉత్పత్తిని పెంచడంతోపాటు గ్రామంలోనే విక్రయించుకునేలా చర్యలు మొదలుపెట్టారు.
ప్రశంసల జల్లు
స్వగ్రామ అభివృద్ధికి కృష్ణయ్య రూపొందించిన ప్రణాళిక, చేస్తున్న కృషికి మంత్రి నారాయణ, కలెక్టర్ జానకితోసహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని తామంతా దత్తత గ్రామాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
టీపీ గూడూరును దత్తత తీసుకుంటా
Published Tue, Mar 3 2015 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM
Advertisement
Advertisement