
రాజంపేట: తిరుపతి–మచిలీపట్నం మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును కడప వరకు పొడిగించే ప్రతిపాదనను రైల్వే అధికారులు తుంగలో తొక్కారు. ఇప్పటికే జిల్లా మీదుగా ధర్మవరం నుంచి విజయవాడకు తిరిగే రైలును ఎర్రగుంట్ల–నంద్యాల మార్గంలో నడుపుతున్నారు. అయితే జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి రైలులేదు. దీంతో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ను కడప వరకు పొడిగించడం వల్ల కనెక్టటివిటీకి నోచుకుంటుందని దక్షిణమధ్య రైల్వేఅధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. కడప వరకు పొడిగింపు చేసే రైళ్ల ప్రతిపాదనలో ఉన్న మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ను దారిమళ్లించడంతో మరోసారి జిల్లాపై రైల్వేమంత్రిత్వశాఖ చిన్నచూపు చూసిందనే విమర్శలను మూటగట్టుకుంటోంది.
రైలు పొడిగింపు ప్రతిపాదన ఇలా..
గతంలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజరుగా పనిచేసిన స్టాన్లీబాబు తిరుపతి–మచిలీపట్నం మధ్య నడుస్తున్న రైలును కడప వరకు పొడిగించడం వల్ల సర్కారు ప్రాంతాలకు కనెక్టటివిటీ పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రతిపాదనను తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన కాకముందే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ, అనంతరం వచ్చిన జీఎంలు దీనిని ఆటకెక్కించారు. మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలును కడప వరకు పొడిగించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పలుమార్లు రైల్వే ఉన్నతాధికారులు, రైల్వేమంత్రిత్వశాఖకు విన్నవించిన సంగతి విధితమే.
రైల్వే అధికారులు కడప రైల్వేస్టేషన్‌లో స్థలసమస్యను బూచిగా చూపుతున్నట్లు విమర్శలున్నాయి. రైళ్లను స్టేబుల్ చేసుకునేందుకు వీలులేని పరిస్థితులు ఉన్నాయనే భావనను తెరపైకి తీసుకొచ్చారు. రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న హెచ్‌పీసీఎల్‌ను భాకరాపేటకు మార్చడంతో ఆ ప్రాంతం కూడా ఇప్పుడు ఖాళీగా ఉంది.ఈ స్థలం యార్డుగా ఉపయోగించుకొని అదనంగా రెండులైన్లను నిర్మితం చేసుకోగలగితే పొడిగింపు రైళ్లను స్టేబుల్ చేసుకునేందుకు వీలుంటుందని రైల్వే నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ధర్మవరం వరకు మచిలీపట్నం రైలు పొడిగింపు
మచిలిపట్నం–తిరుపతి (17401) మధ్య నడిచే రైలును కడపవరకు పొడిగించి రాజధానికి కనెక్టటివిటీ కలుగుతుందనే జిల్లా వాసుల ఆశలను అధికారులు నీరుగార్చారు. మచిలీపట్నం నుంచి తిరుపతికి తెల్లవారుజామున 4.30గంటలకు చేరుకుని, తిరిగి రాత్రి 7.30కి మచిలీపట్నం వెళుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రేక్(ఫార్మసిన్)ఖాళీగా తిరుపతిలో ఉంటుంది. దీంతో కడప వరకు పొడగింపు చేయాలనే ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదనకు స్వస్తి చెప్పి ఈనెల1న నుంచి రైలును తిరుపతి నుంచి ధర్మవరం వరకు (07401, 07402 నంబర్లతో పొడిగించారు.