
సాక్షి, తిరుపతి: కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో ‘జనతా కర్ఫ్యూ’ విజయవంతం కావడం సంతోషంగా ఉందని తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి అన్నారు. ఆయన తిరుపతి నగర వీధుల్లో పర్యటించి ‘జనతా కర్ఫ్యూ’ను పర్యవేక్షించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇతర దేశాలు, హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తుల వివరాలను దాచడం మంచిది కాదన్నారు. సోషల్ మీడియాలో వైరస్‌పై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలతో పాటు చట్టాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు.
బయట ప్రదేశాల నుంచి వచ్చిన వారిని రెవెన్యూ, పోలీస్ వ్యవస్థ డేటాబేస్ ఆధారంగా విచారణ చేపడతామని ఆయన అన్నారు. విదేశాల నుంచి వస్తున్నవారు పారాసిటమాల్ టాబ్లెట్ ఉపయోగించడం వల్ల థర్మో స్కానర్‌లో టెంపరేచర్ తెలియక ఎయిర్‌పోర్టు తనిఖీల్లో వైరస్ లక్షణాలు ఉన్నవారు బయటపడటం లేదన్నారు. కరోనా వైరస్ అరికట్టడానికి చేస్తున్న ప్రచారంలో మీడియా పాత్ర చాలా బాగుందని ఆయన అభినందించారు.