రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పోరాటం చేయాలని ఆపార్టీ నేతలు పిలుపునిచ్చారు.
జమ్మలమడుగు/జమ్మలమడుగురూరల్,న్యూస్‌లైన్: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పోరాటం చేయాలని ఆపార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయంనుంచి సాయంత్రంవరకు సమైక్యరాజకీయ శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు.
సభకు ఎమ్మెల్సీదేవగుడినారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు మాట్లాడుతూ వైఎస్ మరణం తర్వాత రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ పూర్తిగా కుంటుపడిపోయాయన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆ పథకాలన్నీ అమలవుతాయన్నారు. కాంగ్రెస్‌తో జగన్‌తో కుమ్మక్కవుతున్నారని చంద్రబాబు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2011లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అయిన దేవగుడి నారాయణరెడ్డిని ఓడించడానికి కాంగ్రెస్, టీడీపీ ఏకం కాలేదా అని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ తరపున జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఆదినారాయణరెడ్డికి తప్ప మరొకరికి అవకాశం లేదన్నారు. దేవగుడి, ైవె ఎస్ కుటుంబాలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ వైఎస్ సహకారంతోనే జమ్మలమడుగును అభివృద్ధి పథంలో నడిపించానన్నారు. గండికోట ప్రాజెక్టు వైఎస్ పుణ్యమేనన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తయినా ముంపు వాసులకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో ప్రాజెక్టులో కేవలం మూడు టీఎంసీల నీరు మాత్రమే ఉన్నాయన్నారు. నష్టపరిహారం ఇవ్వాలని అధికారులతో పాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి విన్నవించినా ఫలితం లేదన్నారు.
గండికోటతో పాటు రాజోలి, బ్రహ్మణి పరిశ్రమను కలిసికట్టుగా పోరాడి సాధించుకోవాలన్నారు. ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు సమైక్యంగా కృషి చేసి జిల్లాలోని 10 ఎమ్మెల్యే స్థానాలతో పాటు రెండు పార్లమెంట్ సీట్లను గెలుచుకునేందుకు కృషి చేయాలన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ యూత్ జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విభజన ముసుగులో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడుపుతున్నారన్నారు.
సీమాంధ్రులకు ముఖ్యమంత్రితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. ఫ్యాక్షన్ అంతంకోసమే గండికోట ప్రాజెక్టుతో పాటు దాల్మియా, బ్రహ్మణి వంటి పరిశ్రమల ఏర్పాటుకు వైఎస్ కృషి చేశారని ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే మొదటి ముద్దాయి చంద్రబాబే అన్నారు.
రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ తీవ్రం నష్టపోతుందని ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయ కర్తలు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. పెద్దముడియం మండల ఉపాధ్యక్షుడు కె.వి.కొండారెడ్డి, ఈవీవీ సుధాకర్‌రెడ్డి కూడా ఈ సందర్భంగా ప్రసంగించారు. సభకు నియోజవర్గంలోని ఆరు మండలాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివ చ్చారు.