బలనిరూపణకు రెడీ
♦ అధినేత ఎదుట మంత్రులు అమీతుమీ
♦ నామినేటెడ్ పదవుల కోసం నిరీక్షణ ఫలించేనా
♦ నేడు జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం
♦ హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం : అధినేత ఎదుట అమీతుమీ తేల్చుకునేందుకు రాష్ర్టమంత్రులు సిద్ధమవుతున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ-శాఖల మార్పులు చేర్పులు జరుగనున్నాయన్న వార్తల నేపథ్యంలో నగరానికి వస్తున్న అధినేత వద్ద బలనిరూపణకు మంత్రులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు నామినేటెడ్ పదవుల ఆశావాహులు అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు రెడీ అయ్యారు.జిల్లా టీడీపీలో నెలకొన్న ఆదిపత్య పోరుకు విశాఖపట్నంలో జరుగనున్న పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం వేదిక కానుంది. పార్టీ అధ్యక్షుడు..ముఖ్యమంత్రి చంద్ర బాబు పాల్గొననుండడంతో సమావేశానికి ప్రాధాన్యత ఏర్పంది.
నగరంలోని కళావాణి ఆడిటోరియంలో ఉదయం 11.15గంటలకు ప్రారంభమవుతున్న ఈ సమావేశం మధ్యాహ్నం వరకు జరగనుంది. లేని నవ్వులు ముఖాలపై పూసుకుంటున్న మంత్రులు గంటా శ్రీనివాసరావు-చింతకాయల అయ్యన్నపాత్రుడు లోలోన కత్తులు దూసుకుంటున్నారు. వీరి మధ్య ఏర్పడిన అగాధం రోజురోజుకు పెరిగి ప్రస్తుతం పూడ్చలేని స్థాయికి చేరుకుంది. జిల్లాలోని ఎమ్మెల్యేలు..ఇతర ముఖ్యనేతలు కూడా రెండువర్గాలుగా చీలిపోవడంతో పార్టీ శ్రేణులు వీరి ఆదిపత్య పోరు మధ్య నలిగిపోతున్నారు.
ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మాడుగుల నియోజకవర్గంలో జరిగిన శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలతో మంత్రుల మధ్య విబేదాలు తారాస్థాయికి చేరాయి. గవిరెడ్డి మరో అడుగువేసి పార్టీ నాయకుడు విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావుపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తే. గంటా వర్గీయుడైన ఎంపీ అవంతిశ్రీనివాసరావు మంత్రి అయ్యన్నపై ఫైర్ అయ్యారు. కలెక్టర్‌పై సీఎం చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశారు.
తర్వాత కూడా వీరి విబేధాలు తీవ్ర రూపం దాల్చాయి. ఒకరిపై మరొకరు పరోక్షంగా విమర్శలు కూడా చేసుకున్నారు. ఒకసారి హైదరాబాద్‌లోనూ మరొకసారి నర్సీపట్నంలోనూ మంత్రుల విబేధాల పంచాయతీ పెట్టినప్పటికీ కొలిక్కిరాలేదు. సిటీలో కార్యక్రమానికి మంత్రి గంటా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తుంటే...గ్రామీణ జిల్లా నుంచి కూడా భారీగా జనసమీకరణకు మంత్రి అయ్యన్న రెడీ అవుతున్నారు. మంత్రుల మధ్య తాము నలిగిపోతున్నామంటూ అధినేత ఎదుట పంచాయతీ పెట్టేందుకు కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు.
వీరి ఆదిపత్య పోరు ఇలా ఉంటే అధికారం వచ్చి ఏడాదైనా నామినేటెడ్ పదవుల పందారం జరగకపోవడంతో పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధినేత మాటలతోనే సరిపెడతారా? లేక పదవులను విదిల్చేది ఏమైనా ఉందా?అని ఆశగా ఎదురు చూస్తున్నారు.పదవులను ఆశిస్తున్న వారు అధినేత దృష్టిలో పడేందుకు నానాతంటాలు పడుతున్నారు. వుడా స్థానంలో ఏర్పాటవుతున్న విశాఖ మెట్రోపాలిటిన్ డెవలప్‌మెంట్ అథారిటీకి తానే చైర్మన్‌గా ఉంటానని ప్రకటించడంతో వుడా చైర్మన్‌పదవిపై ఆశలుపెట్టుకున్న వారునీరుగారిపోయారు. కనీసం జీవీఎంసీ ఎన్నికలైనా జరిగితే కార్పొరేట్ పదవులను దక్కించుకోవచ్చునని ఆశిస్తున్న వారు బాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జీవీఎంసీ ఎన్నికల నిర్వహిస్తారో లేదో అధినేత ఎదుట తేల్చుకునేందుకు సిద్ధమవు తున్నారు.