
నేడు ‘పంచాయతీ’ నోటిఫికేషన్!
ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు
ఏప్రిల్ ఆరున పోలింగ్
9న ఫలితాల వెల్లడి
బ్యాలెట్ పత్రాలతోనే ఓటింగ్
రంగం సిద్ధం చేస్తున్న అధికారులు
ఇందూరు, న్యూస్‌లైన్:
పంచాయతీరాజ్ ఎన్నికల నగారా మోగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను అదివారం ఖరారు చేసింది. అన్ని స్థానాలకు వచ్చేనెల ఆరున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. తొమ్మిదో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈసారి ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పద్ధతిలోనే పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నామినేషన్ గడువు, ఎన్నికలు జరిగే తేదీ, ఫలితాల ప్రకటన, కోడ్ అమలు తదితర పూర్తి వివరాలను సోమవారం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.
వేగంగా కసరత్తు
రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను సిద్ధం చేసిన నేపథ్యంలో జిల్లా పరిషత్ అధికారులు ఎన్నికల కసరత్తును వేగవంతం చేశారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినప్పటికీ, మరోసారి వాటి లెక్కలను సరి చూసుకుంటున్నారు. మండలాలలో ఎన్ని బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకుంటున్నారు. బ్యాలెట్ పత్రాలను ముద్రించడానికి సిద్ధంగా ఉండాలని ప్రింటింగ్ ప్రెస్‌ల యాజమాన్యాలకు ముందస్తుగానే సమాచారం ఇ చ్చా రు. మండల కార్యాలయాలలో పని చేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగులను, అధికారులను అప్రమత్తం చేశారు. ఎప్పుడు ఎలాంటి సమాచారం అడిగినా వెంటనే తెలపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విషయమై కలెక్టర్ నేడో రేపో సంబంధిత అధికారులతో సమావేశమవనున్నట్లు తెలిసింది.
అధికారులు..
జడ్‌పీటీసీ ఎన్నికల రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లేదా ఆ స్థాయి అధికారి నియమించాలని ఎన్నికల సంఘం కలెక్టర్‌ను ఆదేశించింది. ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఎంపీడీఓ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది. జడ్‌పీటీసీ ఎన్నికలకు తెల్ల రంగు, ఎంపీటీసీ ఎన్నికలకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లు వినియోగించనున్నారు.
నామినేషన్ సెంటర్లు
జడ్‌పీటీసీ స్థానానికి పోటీ చేసేవారు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కా ర్యాలయంలో నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు మండల పరిషత్‌లోనే నామినేషన్లు వేయాలి.