నేడు జిల్లాకు ‘సంతోషి’
విజయనగరం మున్సిపాలిటీ/లీగల్: అంతర్జాతీయ స్థాయిలో జిల్లా ఖ్యాతిని చాటి చెప్పి రజత పతకం దక్కించుకున్న వెయిట్ లిఫ్టర్ మత్స సంతోషి బుధవారం జిల్లాకు రానుంది. స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కామన్‌వెల్త్ పోటీల్లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన సంతోషి 53 కిలోల విభాగంలో మొత్తం 183 కిలోల బరువులు ఎత్తి కాంస్య పతకం దక్కించుకోగా బంగారు పతకం దక్కించుకున్న క్రీడాకారిణి డోపింగ్ పరీక్షలో పట్టుబడడంతో అనూహ్యంగా సంతోషికి రజతం పతకం సొంతమైంది. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన ఈ క్రీడాకారిణి బుధవారం జిల్లాకు వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తరఫున ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కలెక్టర్ ముదావత్ ఎం.నాయక్ ఆదేశాల మేరకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.మనోహర్ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం విజయనగరం చేరుకునే సంతోషిని స్థానిక ఎత్తుబ్రిడ్జి నుంచి కోట జంక్షన్ సమీపంలో గల క్షత్రియ కల్యాణ మండపం వరకు ఊరేగింపుగా తీసుకురానున్నారు. అనంతరం కల్యాణ మండపం ఆవరణలో జిల్లా యంత్రాంగం తర ఫున సముచిత రీతిలో సత్కరించనున్నామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.మనోహర్ తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్ ఎం.ఎం. నాయక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొంటారని, అదేవిధంగా జిల్లాలోని అన్ని క్రీడాసంఘాలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.