వారు నాన్.. లోకల్!
Published Tue, Jan 21 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్: ట్రామాకేర్ పోస్టుల డ్రామాకు ఇప్పట్లో తెర పడేలా లేదు. టీవీ సీరియల్‌లా తెగ ‘సాగు’తోంది. ఒక్కో రోజు ఒక్కో ఎపిసోడ్ తెరపైకి వస్తోంది. అధికారులను లీలలను.. అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కడుతోంది. మొదట్లో రోస్టర్ మాయాజాలాన్ని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’.. ఆ వెంటనే వయసు మీరిన వ్యక్తిని ఎంపిక చేసిన తీరును ఎండగట్టింది. దాంతో తడబడిన రిమ్స్ అధికారులు తప్పులను సరిదిద్దుకుంటామని ప్రకటించారు. అయితే ఈ పోస్టుల భర్తీలో జరిగిన అక్రమాలకు అంతులేదన్నట్లు తాజాగా నాన్ లోకల్ అభ్యర్థులను లోకల్‌గా చూపించిన ఎంపిక చేసిన ఉదంతం వెలుగు చూసింది. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో రిమ్స్ అధికారులు మెరిట్ జాబితా లేకుండా తుది జాబితా విడుదల చేసేశారు.
దీనిపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో స్పందించినకలెక్టర్ ఆదేశాల మేరకు మెరిట్ జాబితా విడుదల చేశారు. మెరిట్, తుది జాబితాలను తరచి చూసిన కొద్దీ అవకతవకలు బయటపడుతున్నాయి. నర్సింగ్ అర్డర్లీ విభాగంలో 9 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించగా 377 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 35 మందిని అనర్హులుగా గుర్తించి, మిగిలిన 342 మందిని మెరిట్ జాబితాలో చేర్చా రు. కాగా తొమ్మిది పోస్టుల్లో ఒకటి బీసీ-సి(డబ్ల్యు) కేటగిరీకి కేటాయించగా.. అభ్యర్థులు లేకపోవడంతో దాన్ని ఖాళీగా ఉంచి, 8 మందిని ఎంపిక చేస్తూ తుది జాబి తా విడుదల చేశారు. ఈ ఎనిమిది మంది ఎంపికలోనూ అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. మెరిట్ జాబితా, తుది జాబితాల్లో అభ్యర్థుల వివరాల్లో తేడాలు ఉండటం ఈ అవకతవకలను బట్టబయలు చేస్తున్నాయి.
మెరిట్‌లో ఒకలా.. ఎంపికలో మరోలా..
మెరిట్ జాబితాలో నాన్‌లోకల్‌గా ఉన్న అభ్యర్థులు తుది ఎంపిక జాబితాకొచ్చేసరికి లోకల్‌గా మారిపోయి ఉద్యోగాలను తన్నుకుపోయారు. మెరిట్ జాబితాలో 4వ స్థానంలో ఉన్న రేఖా సురేష్(రేకమయ్యపాలెం గ్రామం, రెయ్యిపాలెం పోస్టు, భీమునిపట్నం, విశాఖపట్నం) చిరునామా ప్రకారం నాన్‌లోకల్‌గా పేర్కొన్నారు. తుది జాబితాకొచ్చేసరికి అతన్ని లోకల్‌గా మార్చేసి ఎంపిక చేశారు. అలాగే మెరిట్ జాబితాలో 10వ స్థానంలో ఉన్న శీరపు శారద (కొత్త బైపురెడ్డిపాలెం, బలిఘట్టం పోస్టు, నర్సీపట్నం మండలం, విశాఖపట్నం) చిరునామా ప్రకారం నాన్‌లోకల్‌గా పేర్కొన్నారు. తుది జాబితాలో ఈమెను కూడా లోకల్‌గా చూపించి ఎంపిక చేశా రు. నాన్‌లోకల్ అభ్యర్థులు లోకల్ ఎలా అయ్యారో రిమ్స్ అధికారులే చెప్పాలి.
అధికారుల మాయాజాలంతో ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థి
మెరిట్ జాబితాలో ఐదో స్థానంలో ఉన్న లోకల్ అభ్యర్థి అయిన ఎచ్చెర్ల మండలం సనపలవానిపేట గ్రామానికి చెందిన సనపల చక్రధరరావు అధికారుల మాయాజాలంలో చిక్కుకొని ఉద్యోగావకాశం కోల్పోయాడు. రోస్టర్ పాయింట్ 7 కింద ఓపెన్ కాంపిటీషన్‌లో ఎంపిక నిర్వహించిన అధికారులు ఐదో స్థానంలో ఉన్నప్పటికీ లోకల్ అయిన చక్రధరరావును నిబంధనల ప్రకారం ఎంపిక చేయాల్సి ఉంది. అయితే నాలుగో స్ధానంలో ఉన్న నాన్‌లోకల్ అభ్యర్థి రేఖా సురేష్‌ను లోకల్‌గా మార్చి ఉద్యోగం కట్టబెట్టారు. తనకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నాడు. ఈ మేరకు కలెక్టర్ సౌరభ్‌గౌర్‌ను గ్రీవెన్స్‌సెల్‌లో కలసి జరిగిన అన్యాయాన్ని వివరించాడు. రెండో అభ్యర్థి విషయంలోనూ ఇదే రీతిలో జరిగింది.
Advertisement
Advertisement