సాక్షి ప్రతినిధి, విజయనగరం:పాచిపెంటలో సరైన స్థలం, మౌలిక సౌకర్యాల్లేవన్న కారణంతో వెనక్కి మళ్లిన గిరిజన యూనివర్సిటీ మళ్లీ జిల్లాకొచ్చే అవకాశం కనబడుతోంది. తరలిపోతుందన్న వార్తలతో ఆందోళనకు లోనై జిల్లా వాసులు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు, ప్రతిపక్ష నేతల ఆందోళనలకు సర్కార్ తలొగ్గింది. మళ్లీ విజయనగరం జిల్లాలోనే ఏర్పాటు చేసేందుకు పునరాలోచన చేసింది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కొత్తవలస మండలంలో గాని, బొండపల్లి మండలంలో గాని ఏర్పాటు చేసే ఆలోచనతో ముందుకు కదులుతోంది. ఈమేరకు హెచ్‌ఆర్‌డీ జాయింట్ సెక్రటరీ, ఏపీ ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ, వీపీడబ్ల్యూడీ సీఈతో కూడిన బృందం ఈనెల 17న జిల్లాకొస్తోంది. ఆ రోజు స్థల పరిశీలన చేసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తొలుత పాచిపెంట మండలంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు దాదాపు రంగం సిద్ధమయ్యింది.
ఆ మేరకు కేంద్రబృందం జిల్లాకొచ్చి పరిశీలన కూడా చేసింది. ఆ సమయంలో యూనివర్సిటీ ఏర్పాటుకు దాదాపు అంగీకారాన్ని తెలిపింది. కానీ, వెళ్లిన కొన్ని రోజుల తర్వాత పాచిపెంట స్థలం సరైనది కాదని, మౌలిక సౌకర్యాల్లేన్న కారణం చూపి విశాఖ జిల్లా సబ్బవరంలో ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. దీంతో జిల్లా వాసులు ఉలిక్కి పడ్డారు. విద్య, ఉద్యోగ, గిరిజన సంఘాలు తీవ్ర నిరాశకు లోనై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వచ్చిన అవకాశాలను పొగొడుతున్నారని టీడీపీ నేతలపై ఆగ్రహం వెలిబుచ్చారు. దీంతో జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులు స్పం దిస్తూ గిరిజన యూనివర్సిటీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయిం చుకున్నారు. ఆ మేరకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల నుంచి మద్దతు లేఖలను తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేశారు.
అటు నిరసన, ఇటు లేఖల నేపథ్యంలో సర్కార్‌కు తలొగ్గక తప్పలేదు. విజయనగరం జిల్లాలో కాకుండా మరో చోట ఏర్పాటు చేస్తే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని గ్రహించి పాచిపెంట కాకుండా మరో చోట ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. దీంతో కొత్తవలస, బొండపల్లి మండలాల్లో రెండు స్థలాలను గుర్తించి, ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలు వెళ్లిన పిమ్మట కేంద్రం స్పందిస్తూ విజయనగరం జిల్లాలోనే ఏర్పాటు చేసేందుకు సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో స్థల పరిశీలన కోసం ఈనెల 17న ఒక బృందం జిల్లాకు రానుంది. ఈమేరకు అటు విద్యా శాఖామంత్రి గంటా శ్రీనివాసరావుకు, ఇటు జిల్లా అధికారులకు సమాచారం కూడా వచ్చింది. ప్రతిపాదిత రెండు స్థలాలను పరిశీలించాక సదరు బృందం తుది నిర్ణయం తీసుకోనుంది.
చివురిస్తున్న ఆశలు
Published Mon, Feb 16 2015 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 PM
Advertisement
Advertisement