ఎర్రజెండాల పేరుతో సీఐటీయూ కార్మికులను దోచుకుంటోందని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు.
కార్మిక సంఘం ఎన్నికల్లో బుద్ధిచెప్పండి
‘ట్రైడెంట్’ కార్మికుల సమావేశంలో టీఆర్‌ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి
జహీరాబాద్, న్యూస్‌లైన్
ఎర్రజెండాల పేరుతో సీఐటీయూ కార్మికులను దోచుకుంటోందని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. మంగళవారం రాత్రి మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో గల ‘ట్రైడెంట్’ చక్కెర కర్మాగారం వద్ద నిర్వహించిన కార్మికుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే నెలలో కర్మాగారంలో జరగనున్న కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులు హెచ్‌ఎంఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కర్మాగారంలో అధికారంలో ఉన్న సీఐటీయూ కార్మికులను అన్ని విధాలుగా దోచుకుంటూ మోసగిస్తోందన్నారు. చందాల పేరుతో దందాలు చేస్తూ కార్మికులను తీవ్ర అన్యాయానికి గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు కాంట్రాక్టు కార్మికులను సైతం విడిచి పెట్టడం లేదన్నారు. కర్మాగారంలో యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తోందన్నారు.
సీఐటీయూ నిజ స్వరూపాన్ని గుర్తించిన మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారం కార్మికులు ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీఐటీయూను ఓడించి తెలంగాణ మజ్దూర్ సంఘ్‌ను గెలిపించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కార్మికులు సీఐటీయూ మోసాలను గుర్తెరిగి హెచ్‌ఎంఎస్‌కు మద్దతు పలకాలన్నారు. తెలంగాణకు టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు గాంధీలాంటి వారన్నారు. ఆయన పోరాటం ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడబోతోందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కర్మాగారం కార్మికులతో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారం కార్మికులు పాల్గొన్నారు. అంతకు ముందు హెచ్‌ఎంఎస్‌జెండాను ఆవిష్కరించారు.