సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తాజా రాజకీయ పరిణామాలు జిల్లాలోని కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలను కలవరపరుస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందనే ఆనందం కంటే.. తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందోననే బెంగే వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ప్రస్తుత సమీకరణలు వారిని అంతర్మథనంలో పడేస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రమిస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో... ఇప్పుడు ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. సోమవారం టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రాన్ని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే దిగ్గీరాజాను కలిశానని చంద్రశేఖర్ చెబుతున్నప్పటికీ.. ఆయన త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమంటూ విశ్వసనీయవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వ్యవహారం వికారాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ప్రసాద్‌కుమార్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
తన ప్రత్యర్థిని చేరదీయడం ద్వారా తన సీటుకు ఎసరు పెడతారేమోననే గుబులు పట్టుకుంది. నేరుగా హైకమాండ్ పెద్దలను కలవడం వెనుక చంద్రశేఖర్ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజా సంకేతాలు సిట్టింగ్ శాసనసభ్యుడు ప్రసాద్ శిబిరంలో కల్లోలం రేపుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న చంద్రశేఖర్‌కు పార్టీ తలుపులు తెరవడంతో తన భవిష్యత్తు ఏంటనే అంతర్మథనం మొదలైంది. మరోవైపు ఇన్నాళ్లూ చంద్రశేఖర్ ను ఎదురొడ్డి రాజకీయాలు నెరుపుతున్న కాంగ్రెస్ శ్రేణుల్లోనూ తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వైరివర్గంపై పైచే యి సాధించేందుకు పావులు కదిపామని, ఈ తరుణంలో ఆయనే తమ పంచన చేరితే పరిస్థితేంటనే మీమాంసలో పడ్డారు. ఇదే భావన చంద్రశేఖర్ వ ర్గీయుల్లోనూ వ్యక్తమవుతోంది.
విలీనం..ఐతే..!
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించడం, తమ పార్టీ మనుగడపై జరుగుతున్న రకరకాల ప్రచారాలు గులాబీ నేతలను ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. రాష్ర్టం ప్రకటిస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని గతంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్రకటన గులాబీ శిబిరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 8 నెలల క్రితం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డికి తాజా పరిణామాలు ఇబ్బందిగా మారాయి. తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ టీడీపీని వీడి కారెక్కిన హరీశ్వర్‌కు... సరికొత్త సమీకరణలు గందరగోళ ంలో పడేస్తున్నాయి. ఇప్పటికే పరిగిలో మాజీ మంత్రి కమతం రాంరెడ్డి, పీసీసీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డిలు కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్నారు. ఈ క్రమంలోనే టీఆర్ ఎస్ కూడా కాంగ్రెస్‌లో కలిసిపోతే.. తన పరిస్థితేంటనేది హరీశ్వర్‌కు అంతుచిక్కడంలేదు. ఇదే పరిస్థితి ఇరువురు నేతల్లోనూ వ్యక్తమవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చే రితే తమ సీటుకు ఎసరు వచ్చినట్లేనని కమతం, రామ్మోహన్ వర్గీయులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అలాగే టీడీపీని వీడి మేడ్చల్ సీటుపై గంపెడాశలు పెట్టుకున్న మలిపెద్ది సుధీర్‌రెడ్డికి కూడా తాజా పరిణామాలు మింగుడుపడడంలేదు. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తోంది కాంగ్రెస్‌కు చెందిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి. ఈ క్రమంలో ఆయనకు కాదని సుధీర్‌కు టికెట్ దక్కడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
విలీనం.. కాకపోతే..!!
జిల్లాలో టీఆర్‌ఎస్ ప్రభావం నామమాత్రమేనని, ఆ పార్టీకి లేనిపోని ప్రాధాన్యతనిచ్చి చేర్చుకోవడం వల్ల ఒరిగేదేమీలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. గతంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో కూడా వికారాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు డిపాజిట్ దక్కలేదని, అలాంటి పార్టీని విలీనం చే సుకోవడం ద్వారా ఇరుపక్షాల్లోనూ అసమ్మతికి దారితీయడం ఖాయమని, తద్వారా గెలిచే సీట్లను వదులుకోవాల్సివుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనంపై సర్వత్రా చర్చ
Published Wed, Aug 7 2013 1:08 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement