కాంగ్రెస్, టిఆర్ఎస్ విలీనంపై దోబూచులాట!
కాంగ్రెస్లో టిఆర్ఎస్ విలీనంపై దోబూచులాట జరుగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ఊపందుకున్న నేపధ్యంలో టిఆర్ఎస్ విలీనంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. తమ పార్టీ ఏ పార్టీలోనూ విలీనమయ్యే ప్రసక్తి లేదని, ఏ పార్టీతోనూ పొత్తు కూడా ఉండదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు నిన్న తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ శిక్షకుల సమావేశంలో స్పష్టం చేశారు. ‘ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడతం. తెలంగాణ పునర్నిర్మాణంలోనూ పార్టీ ఉంటది. ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి నాకు కొన్ని పరిమితులు, పరిధి ఉన్నయి. ఈ సమయంలో కాంగ్రెస్‌తో గోక్కోవడం ఎందుకు? అందుకే ప్రెస్‌మీట్లలో చెప్తారో, మీటింగులలో చెప్తారో మీ ఇష్టం. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడుతామని శ్రేణులకు చెప్పి, ఎన్నికలకు సిద్ధం చేయండి’ అని కేసీఆర్ సూచించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం)తో టిఆర్ఎస్ నేతల సమావేశం ముగిసిన తరువాత కూడా ఇద్దరు మంత్రులను ప్రత్యేకంగా కలిసి కొద్దిసేపు మంతనాలు జరిపారు. కేంద్ర మంత్రులు ఆంటోనీ, సుశీల్ కుమార్ షిండేలతో బిల్లు, విలీనం విషయమై మాట్లాడారు. ''నేను చెప్పింది మీరు బిల్లులో పెడితే, మీరు చెప్పింది నేను చేస్తాను'' అని వారికి కెసిఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎటువంటి ఆంక్షలు లేకుండా హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే టిఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశం ఉంది. అలా చేస్తే విలీనం అంశం ఆలోచిస్తామని ఆయన గతంలో చెప్పారు. హైదరాబాద్పై ఏదైనా కిరికిరి చేస్తారేమోనని కెసిఆర్ అనుమానం. దానిని కేంద్రపాలిత ప్రాంతం చేసే అవకాశం ఉందని కూడా ఆయన భయం. అందుకే ఆయన విలీనం విషయం స్పష్టంగా ప్రకటించడంలేదు.
జిఓఎంతో భేటీ ముగిసిన అనంతరం విలీనం విషయమై విలేకరులు అడిగి ప్రశ్నకు ''తెలంగాణ బిల్లు పాసైన తరువాత ఆ విషయం ఆలోచిస్తాం'' అని చెప్పారు. విలీనం లేదన్న వార్తలను ఖండించలేదు. అంటే ఈ అంశాన్ని అడ్డం పెట్టుకొని తను అనుకున్నవి సాధించే ప్రయత్నంలో కెసిఆర్ ఉన్నట్లు అర్ధమవుంతోంది.
కెసిఆర్ ప్రధానంగా కోరుకుకే అంశాలు:
* ఎటువంటి ఆంక్షలు లేని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం.
* హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ.
* తెలంగాణ ప్రభుత్వ అధికారాలకు కోత విధించకూడదు.
* హైదరాబాద్ అయిదేళ్లే ఉమ్మడి రాజధానిగా ఉండాలి.
* మిగిలిన 28 రాష్ట్రాలతో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా కొనసాగుతున్నాయో అలాగే తెలంగాణతో కొనసాగాలి.
* హైదరాబాద్ రెవెన్యూలో వాటాల పంపిణీకి ఉండకూడదు.
* తెలంగాణ ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు ఇవ్వాలి.
* హైదరాబాద్‌లో ఎవరికి ప్రత్యేక హక్కులు అవసరంలేదు.
* రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వపు హక్కు అందరికీ వర్తిస్తుంది.
* తెలంగాణ భూపరిపాలనలో పరిమితులు విధించకూడదు.
* సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నేతృత్వంలోని ట్రిబ్యునల్ మాత్రమే జలవనరుల పంపిణీని చూడాలి.
* న్యాయబద్ధంగా నిర్మించిన ప్రాజెక్టుల అంశంలో అభ్యంతరాలు లేవు.
* గాలేరు-నగరి, హంద్రినీవా, కండలేరు, మశిల, వెలిగొండ, వెలిగోడు, చిత్రావతి, లింగాల కెనాల్ ప్రాజెక్టులపై అభ్యంతరాలు.
కెసిఆర్ అనుకున్నట్లుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే టిఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.