జంగారెడ్డిగూడెం : వైద్య, ఆరోగ్య శాఖలో నకిలీ నియామక పత్రాలు సృష్టించి ఏడుగురికి ఉద్యోగాలు ఇచ్చిన వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ వెల్లడించారు. శుక్రవారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు. 2017 జూలైలో వైద్య, ఆరోగ్య శాఖలో జిల్లాలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకం కోసం వైద్య, ఆరోగ్య శాఖ 47 మందికి నియామక పత్రాలు ఇచ్చినట్టు తెలిపారు.
వీరిలో ఏడుగురు నకిలీ నియామక పత్రాలతో విధుల్లో చేరినట్టు గుర్తించారన్నారు. గౌరీపట్నం పీహెచ్‌సీలో కె.వరప్రసాద్, పూళ్ల పీహెచ్‌సీలో మహ్మద్ అజీముల్లా, బొర్రంపాలెం పీహెచ్‌సీలో ఎస్.దుర్గాప్రసాద్, లక్కవరం పీహెచ్‌సీలో వై.వెంకటరాజు, యలమంచిలి పీహెచ్‌సీలో ఆర్.ఏడుకొండలు, గుండుగొలను పీహెచ్‌సీలో ఎన్.నాగేశ్వరరావు, వీఆర్‌గూడెం పీహెచ్‌సీలో బి.రాజ్‌కుమార్ నకిలీ నియామక పత్రాలతో విధుల్లో చేరారన్నారు.
వీరికి అప్పట్లో డీఎంహెచ్‌వో కార్యాలయంలో పనిచేస్తున్న అబ్దుల్ కరీం, అవుట్ సోర్సింగ్‌పై డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కేవీ సత్యప్రసాద్ ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షలు తీసుకుని ఏడుగురు ఉద్యోగులకు నకిలీ నియామక పత్రాలు ఇచ్చారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ప్రస్తుతం లక్కవరం పీహెచ్‌సీలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహ్మద్ అబ్దుల్ కరీం, ఏలూరుకు చెందిన కేవీ సత్యప్రసాద్‌లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
వీరి నుంచి రూ.1.10 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నకిలీ నియామక పత్రాలపై ఉద్యోగం పొందిన ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్టు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. సమావేశంలో సీఐ కె.బాలరాజు, లక్కవరం ఎస్సై జగదీశ్వరరావు పాల్గొన్నారు.
‘సాక్షి’ కథనంతో వెలుగులోకి..
వైద్య, ఆరోగ్య శాఖలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలపై ‘సాక్షి’ గత నెల 8న ‘ఆరోగ్య శాఖకు నకిలీ మకిలి’ శీర్షికన కథనం ప్రచురించింది. ఆ తర్వాత వరుసగా మరో రెండు కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. ఈ కథనాలపై స్పందించిన జిల్లా ఎస్పీ పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. దీంతో నకిలీ ఉద్యోగుల గుట్టు రట్టైంది. ఈ కేసులో సూత్రదారులను తాజాగా అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఆ శాఖ ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టు సమాచారం. ఉన్నతాధికారులను వదిలి కిందిస్థాయి సిబ్బందిని మాత్రమే బాధ్యులను చేశారని ఆ శాఖ ఉద్యోగులు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment