ఉడా మాయం
- ప్రశ్నార్థకంగా మారిన రూ.500 కోట్ల విలువైన స్థలాల భవిత
- రూ.160 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ప్రభుత్వానికే..
- ఉడా ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలే
సాక్షి, విజయవాడ : విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీజీటీఎం ఉడా) కనుమరుగు కానుంది. ఉడాను రద్దు చేస్తూ మూడు, నాలుగు రోజుల్లో ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది. ఉడా స్థానంలో రాజధాని క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీపీ) ఏర్పాటు కానుంది.
దీంతో ఉడా ఉద్యోగుల భవితవ్యం, ఉడా స్థిరాస్తులు, కోట్ల రూపాయల నగదు నిల్వలు, ఉడాకు రావాల్సిన వందల కోట్ల బకాయిలు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, పదుల సంఖ్యలో ఉన్న ప్రతిపాదనలు.. ఇలా అన్ని అంశాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పలు ప్రాజెక్టుల ఫైళ్లు ఉడా వద్ద అనుమతుల కోసం పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటిపై స్పష్టత ఇవ్వకుండానే, సీఆర్‌డీపీ విధివిధానాలు ఖరారు చేయకుండానే సుదీర్ఘ చరిత్ర గల ఉడాను రద్దుచేయనుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
1978లో ప్రారంభం
మున్సిపల్ చట్టం-1975 ప్రకారం 1978లో వీజీటీఎం ఉడా ఆవిర్భవించింది. అప్పట్లో విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి పట్టణాల పరిధిలోని సుమారు 1,670 చదరపు కిలోమీటర్ల మేరకే ఉడా కార్యకలాపాలు పరిమితమయ్యాయి. కాలక్రమేణా విజయవాడ, గుంటూరు నగరాలుగా మారాయి. ఉడా పరిధి కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఉడా పరిధిని 2012లో 7,067 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉడా పరిధిలోకి రెండు నగరపాలక సంస్థలు, 10 మున్సిపాలిటీలు, 1,520పైగా గ్రామాలు చేరాయి.
ఉడా చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు ఇవీ..
సుమారు 36 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఉడా తన పరిధిలోని పట్టణాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించింది.
విజయవాడ, గుంటూరు నగరాల్లో ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్ల నిర్మాణం చేపట్టింది. పలు పార్కులను ఆధునికీకరించింది. వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేసింది.
విజయవాడలోని పాయకాపురంలో 1989లో 137 ఎకరాల విస్తీర్ణంలో ఉడా లేఅవుట్ వేసి ప్లాట్లు విక్రయించింది. వీటిలో ప్రస్తుతం ఉడా వద్ద 14 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి.
1988-90 సంవత్సరాల్లో గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం నవులూరులో 390.38 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమిలో 2000 సంవత్సరంలో అమరావతి టౌన్‌షిప్ పేరుతో భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేసింది. మొత్తం 285.17 ఎకరాల భూమిలో 1,327 ప్లాట్లు వేసి విక్రయించారు. అమరావతి టౌన్‌షిప్ మినహా 162.81 ఎకరాల భూమి ప్రసుత్తం ఉడా ఆధీనంలోనే ఉంది. ఈ రెండు వెంచర్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఉడా ప్లాట్లు విక్రయించింది. అయితే వాటిని అభివృద్ధి చేయలేదు.
రూ.160 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు
ఉడా వద్ద నగదు నిల్వలు కూడా భారీగా ఉన్నాయి. ఈ ఏడాది ఉడా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి రూ.160 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. వీటిపై ఏటా సగటున రూ.12 కోట్ల వరకు వడ్డీ వస్తుంది. వీటితోపాటు వివిధ సేవలకుగానూ ప్రతి సంవత్సరం రూ.20 కోట్ల ఆదాయం వస్తుంది. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘూల నుంచి కూడా వివిధ రూపాల్లో ఏటా ఫీజులు వస్తుంటాయి. ఈ క్రమంలో 1992 నుంచి విజయవాడ నగరపాలక సంస్థ ఉడాకు రూ.70 కోట్లు బకాయి పడింది. ఉడా రద్దు అయితే ఈ బకాయి కూడా మాఫీ అయ్యే అవకాశం ఉంది.
రూ.750 కోట్ల విలువైన ప్రాజెక్టులన్నీ బుట్టదాఖలే..
ఉడా ప్రతిష్టాత్మకంగా రూ.750 కోట్లతో పలు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆయా ప్రతిపాదనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. కొన్ని ప్రతిపాదనలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు దృష్టిసారించారు. శాఖలవారీగా ప్రతిపాదనలను పంపించి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఉడా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కృష్ణా విజయసాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం డీపీఆర్ తయారీ దశలో ఉంది. ఉడా రద్దయితే ఈ ప్రాజెక్టులన్నీ తెరమరుగవుతాయని అధికారులు చెబుతున్నారు.
ఉన్న స్థిరాస్తులు ఇవీ...
వీజీటీఎం ఉడాకు ప్రస్తుతం భారీగా ఆస్తులు ఉన్నాయి. వాటి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.500 కోట్ల వరకు ఉంటుంది.
అమరావతి టౌన్‌షిప్, పరిసర ప్రాంతాల్లో 162.81 ఎకరాల భూమి ఉంది. అక్కడ బహిరంగ మార్కెట్‌లో ఎకరం ధర రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఉంది.
విజయవాడ గురునానక్ కాలనీలో 1,125 చదరపు గజాల స్థలం ఉంది. దీనివిలువ రూ.4.5 కోట్లు ఉంటుంది.
విజయవాడ పాయకాపురం లే అవుట్‌లో మిగిలిన 14 ప్లాట్ల విలువ కూడా రూ.2 కోట్లకు పైగా ఉంటుంది.
గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో 9 ఎకరాల భూమి ఉంది. దీని విలువ సుమారు రూ.70 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
వీటితోపాటు విజయవాడ, గుంటూరు, తెనాలి ప్రాంతాల్లో సొంత భవనాలు ఉన్నాయి.