
పుష్కరష్కర తొక్కిసలాట దుర్ఘటన దోషి చంద్రబాబే
ఏకసభ్య కమిషన్ వద్ద మాజీ ఎంపీ ఉండవల్లి అఫిడవిట్ దాఖలు
రాజమహేంద్రవరం క్రైం: గోదావరి పుష్కరాల ప్రారంభం సందర్భంగా గతేడాది జూలై 14న రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట దుర్ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ప్రధాన కారణమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌కు ఆయన శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేశారు. పుష్కర ఘాట్‌లో సీఎం గంటల తరబడి ఉండడంతో భక్తుల రద్దీ పెరిగిపోయిందని, తరువాత ఒక్కసారిగా భక్తులను ఘాట్‌లోకి వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని చెప్పారు. ఈ ఘటనలో 29 మంది మృత్యువాత పడ్డారని, 52 మంది గాయపడ్డారన్నారు.
తొక్కిసలాటకు సంబంధించిన ఆధారాలు సమర్పించడానికి తనకు సమయం ఇవ్వాలని కమిషన్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. పుష్కర ఏర్పాట్లు, భక్తుల రద్దీని నియంత్రించడంలో అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలను అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ప్రముఖులు స్నానాలు చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ సీఎం పుష్కర ఘాట్‌లో స్నానం చేశారని, ప్రజలకు సౌకర్యాలు, రక్షణ కల్పించాల్సిన అధికార యంత్రాంగం ఆయన రక్షణలో ఉండిపోవడంతో తొక్కిసలాట జరిగిందని ఉండవల్లి వివరించారు.