
మోదీని జగన్ కలిస్తే అంత ఉలుకెందుకు..?
రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని అమలు చేయాలని..
- చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి సూటి ప్రశ్న
- రాద్ధాంతం వెనుక వారికున్న భయం కనిపిస్తోంది
- మోదీని అరెస్టు చెయిస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు
- అవినీతి, ఓటుకు కోట్లుపై చర్యలు తీసుకుంటారేమోనని బాబుకు భయం
- వ్యవస్థ బాగుపడాలంటే మోదీ రావాలని జగన్ చెప్పారు
- విభజన చట్టం హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని అమలు చేయాలని, రాజధాని లేని ఏపీకి పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేలా సహాయం చేయాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విన్నవిస్తే సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలకు అంత ఉలుకెందుకని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఉండవల్లి విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడం వెనుక వారికి మరేదో భయం పట్టుకున్నట్లుగా కనిపిస్తోందన్నారు.
గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో మోదీ దేశ పర్యటన చేస్తున్నప్పుడు.. ఆయన హైదరాబాద్‌కు వస్తే అరెస్ట్ చేస్తామని 2003 ఆగస్టు 27న విలేకర్ల సమావేశం పెట్టి మరీ చంద్రబాబు హెచ్చరించారని, హైదరాబాద్ కమిషనర్‌కు ఆదేశాలు కూడా జారీ చేశారని చెప్పారు. అది మోదీ మనసులో పెట్టుకున్నారేమోనన్న ఆందోళన చంద్రబాబుకు ఉన్నట్టుందని, అవినీతి, ఓటుకు కోట్లు వంటి కేసుల నేపథ్యంలో ఎక్కడ చర్యలు తీసుకుంటారేమోనని ముఖ్యమంత్రికి భయం పట్టుకున్నట్లు ఉందన్నారు. భవిష్యత్తులో మోదీ, జగన్ కలిసి ముందుకు సాగుతారేమోనన్న అనుమానం టీడీపీ నేతలు, సీఎం చంద్రబాబులో నెలకొనడంతోనే ఇంత రాద్ధాంతం చేశారని ఆరోపించారు.
2004లో పరిటాల రవి హత్య అనంతరం అప్పటి కాంగ్రెస్ ప్రధానిని ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు కలసి ‘వైఎస్ రాజశేఖరెడ్డి ఈ హత్య చేయించారని’ ఫిర్యాదు చేయగా లేనిది, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, విభజన హామీలపై జగన్ ప్రధానిని కలసి విన్నవిస్తే వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. గతంలో ఓసారి మోదీని జగన్ కలసిన తర్వాత విలేకర్ల అడిగిన ప్రశ్నకు ‘తమ మద్దతు మోదీకి అవసరంలేదు కానీ, ఆయన మద్దతు ఏపీకి అవసరం’ అని జగన్ చెప్పిన విషయం గుర్తుచేశారు. ‘వ్యవస్థను మార్చాలంటే మోదీలాంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధాని కావాలి’ అని ఎన్నికల ముందే జగన్ చెప్పారని, కొత్తగా మోదీ, జగన్‌ల మధ్య ఏమీ లేదన్నారు.
విభజన హామీల అమలుపై శ్వేతపత్రం ఇవ్వండి...
రాష్ట్ర విభజన చేసిన మూడేళ్లలో చట్టంలో ఉన్నవి అమలు చేయకపోతే రాష్ట్రపతి కలుగజేసుకునే అవకాశం రాజ్యాంగం ద్వారా విభజన చట్టం సెక‌్షన్ 108లో ఉందన్నారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఏం వచ్చింది? ఏం రాలేదు? అన్న దానిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారని ఇంటూరి రవికిరణ్‌ను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.
తాను కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నానని, తనను అరెస్ట్ చేయాలని ఉండవల్లి సవాల్ విసిరారు. రాజధాని వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో జపాన్ అర్కిటెక్ట్ కంపెనీ మకీ అసోసియేట్స్ రాసిన లేఖతో స్పష్టమైందన్నారు. సమావేశంలో ఉండవల్లి అనుచరులు బాబీ, అశోక్‌కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు.