- జగ్గయ్యపేట మండలంలో అక్రమాల గుర్తింపు
- రూ.98లక్షల రికవరీకి ఆదేశం
- సామాజిక తనిఖీ ప్రజావేదిక సభలో ఉద్రిక్తత
చిల్లకల్లు (జగ్గయ్యపేట) : జగ్గయ్యపేట మండలంలో 2013, జూన్ నుంచి 2014 మే వరకు నిర్వహించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ.1.63కోట్ల మేరకు అక్రమాలు జరిగాయి. ఈ మొత్తంలో రూ.98లక్షలు రికవరీ చేయాలని, రూ.40లక్షలపై విచారించాలని ఆదేశించినట్లు పీడీ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జగ్గయ్యపేట మండల ఉపాధి హామీ పథకంపై సామాజిక తనిఖీ ప్రజావేదిక జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభకు 17 గ్రామాలకు చెందిన కూలీలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
పంచాయతీల వారీగా ఉపాధి హామీ పథకం జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ అనిల్‌కుమార్ సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో గుర్తించిన నివేదికలను చదివి వివరించారు. మండలంలో 2013, జూన్ నుంచి 2014, మే వరకు రూ.7కోట్ల మేర మట్టి, రోడ్లు, కంపచెట్లు తొలగింపు వంటి పనులను చేపట్టినట్లు తెలిపారు. ఈ పనుల వివరాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు వారం రోజులపాటు గ్రామాల్లో సామాజిక తనిఖీ బృందం సభ్యులు పర్యటించి పనుల వివరాలను గుర్తించారని చెప్పారు.
బినామీ పేర్లతో మస్తర్లు, మట్టి తోలకాలు, ట్రాక్టర్లకు చెల్లించే రశీదు నంబర్లు, ద్విచక్రవాహనాల నంబర్లు, మృతిచెందిన వారికి వేతనాలు చెల్లించడం వంటివి గుర్తించినట్లు వివరించారు. మొత్తం పనులు రూ.7కోట్లతో నిర్వహించగా, రూ.1.63 కోట్ల మేరకు అవినీతిని గుర్తించినట్లు తెలిపారు. బాధ్యుల నుంచి రూ.98లక్షల రికవరీకి ఆదేశించినట్లు పీడీ తెలిపారు. మరో రూ.40లక్షల విలువైన పనులపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్‌కు మద్దతుగా గ్రామస్తుల ఆందోళన
షేర్‌మహ్మద్‌పేట ఫీల్డ్ అసిస్టెంట్ సక్రమంగానే పనిచేస్తున్నాడని, అతనిపై కొందరు రాజకీయ నాయకులు వ్యక్తిగత ద్వేషంతో అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని కూలీలు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సభలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ సైతం సమాధానం చెప్పాలని నిలదీశారు. మల్కాపురానికి చెందిన కొందరు నాయకులు కూడా ఫీల్డ్ అసిస్టెంట్ సక్రమంగా పనిచేయడం లేదంటూ ఫిర్యాదు చేయగా, కూలీలు ఖండించారు.
పనులు సక్రమంగా చేశామని, ఫీల్డ్ అసిస్టెంట్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ అధికారులకు లిఖితపూర్వంగా వినతిపత్రం అందించారు. పోచంపల్లిలో మృతిచెందిన వారికి వేతనాలు ఇవ్వడంతోపాటు మట్టి రోడ్డుకు రూ.2.47 లక్షలను అదనంగా చెల్లించినట్లు గుర్తించారు. తనిఖీ బృందం నివేదికల ఆధారంగా ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తగదని, వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలని పలువురు కోరారు. ఆరోపణలు, పత్యారోపణలో ఒకదశలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి సురేష్‌బాబు, ఏపీడీ కవిత, స్టేట్ టీం మానిటర్ కె.సత్యనారాయణ, ఎంపీపీ తాళ్లూరి పార్వతి, జెడ్పీటీసీ సభ్యురాలు ఎ.రాణి, ఎస్‌ఆర్పీలు ఎన్‌వీవీఎస్‌ఎన్ రెడ్డి, ఎ.నాగేశ్వరరావు, డి.ప్రభాకర్, 22మంది డీఆర్పీలు, 47మంది వీఎస్పీలు పాల్గొన్నారు.