సాక్షి, విజయవాడ: తాను ప్రస్తుతం రాజకీయాల్లో లేకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావాలని ఎప్పుడూ కోరుకుంటానని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు జాతీయ రహదారుల విస్తరణ అభివృద్ధి ప్రాజెక్టులను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం ఉదయం విజయవాడలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఉప రాష్ట్రపతి అయినప్పటికీ ఒక తెలుగువాడిగా ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చానన్నారు. విజయవాడ-ముక్త్యాల మధ్య జల రవాణా ద్వారా సరకు రవాణాతో పాటు పర్యాటక అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో తెలుగు భాష తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్టు తెలిపారు. కన్న తల్లిని, మాతృ భాషను మర్చిపోవద్దంటూ తెలుగు భాష, పరభాష మనిషికి కళ్ళు లాంటివని అన్నారు. ఏపీలో ఉద్యోగం కావాలంటే తప్పనిసరిగా తెలుగు వచ్చి ఉండాలని, తెలుగులో పాస్ అయి ఉండాలి అనే నిబంధన పెట్టాలని వ్యాఖ్యానించారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృ భాషను మాత్రం మర్చిపోవద్దన్నారు. తాను వీధి బడిలో చదివినా ఉపరాష్ట్రపతి అయ్యాను.. చంద్రబాబు తెలుగు మీడియంలోనే చదివారు.. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.. అలాగే నరేంద్ర మోడీ కాన్వెంట్లో చదవలేదు.. కానీ ఆయన భారత ప్రధాని అయ్యారు అని ఉదహరించారు.
జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. లక్ష కోట్లు
విజయవాడ: ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... 80 శాతం రవాణా జాతీయ రహదారులపైనే జరుగుతోందన్నారు. ప్రస్తుతం రోజూ 28 కి.మీ జాతీయ రహదారులు నిర్మిస్తున్నామని, జల రవాణా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని గడ్కరీ అన్నారు. అలాగే ఏపీలో జల రవాణా ప్రాజెక్ట్ పనులు త్వరగా పూర్తి చేస్తామని, సాగునీరు ఇస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని, 201 9లోగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేందుకు నా వంతు సహకారం అందిస్తానని ఆయన అన్నారు. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని గడ్కరీ పేర్కొన్నారు.
ఏపీకి కేంద్రం చేయూతనివ్వాలి
కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇవాళ మహత్తర కార్యక్రమానికి చరిత్రలో శ్రీకారం చుడుతున్నామన్నారు. జాతీయ రహదారిపై ఇంత పెద్దఎత్తున ప్రాజెక్టులు ఎప్పుడూ రాలేదంటూ ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలపాలంటే ఆంధ్రప్రదేశ్ కీలకం అని, ఏపీ వంటి కీలక ప్రాంతానికి కేంద్రం చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. విభజన సమయంలో వెంకయ్య నాయుడు, గడ్కరీ మనకు ఎంతో సాయం అందించారని, రాష్ట్రంలో పుట్టిన వ్యక్తిగా వెంకయ్య రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారని కితాబు ఇచ్చారు. జాతీయ జల రవాణా మార్గాల్లో మొదటి ప్రాజెక్టు ముక్త్యాల నుంచి విజయవాడ వరకూ నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న వివిధ జాతీయ రహదారి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఏదైనా ప్రాజెక్టు అనుకుంటే అది పూర్తయ్యేవరకు గడ్కరీ-వదిలిపెట్టనరన్నారు. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్ గా తయారు చేసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయనని తెలిపారు. కాకినాడ-పాండిచ్చేరి జలరవాణా మార్గం ద్వారా చౌక రవాణాకు ఆస్కారం ఉందని, కాలుష్య రహిత రవాణాకు కూడా వీలు కలుగుతుందని, చెన్నై నుంచి కోల్‌కతా వరకు రవాణాకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా, విజయవాడ-అనంతపురం, విశాఖ-రాయపూర్, విజయవాడ ఔటర్ రింగ్ రోడ్లకు కేంద్రం సహకరించాలని కార్యక్రమంలోమ పాల్గొన్న నితిన్ గడ్కరీని చంద్రబాబు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment