విజయనిర్మలకు మొండి 'చేయి'
దేశంలో వివిధ రంగాల్లో వ్యక్తులు, ప్రముఖులు అందించిన సేవలకు గుర్తింపు భారత ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రకటించిన ప్రతిసారి ఏదో ఒక వివాదం పద్మ అవార్డులను చుట్టుముడుతోంది. పద్మ అవార్డుల ప్రకటించడంపై అనేక వివాదాలు, ఆరోపణలు, విమర్శలు వస్తూనే ఉన్నాయి. మహిళా సాధికారిత, మహిళా చైతన్యం అంటూ వీలు చిక్కినప్పుడల్లా ఊక దంపుడు ఉపన్యాసాలు చేసే ప్రభుత్వాలు.. సరియైన ప్రతిభను, ప్రతిభావంతులను గుర్తించడంలో విఫలమవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. గత కొద్దికాలంగా పద్మ అవార్డుల ప్రకటించిన తీరు చూస్తే.. ప్రాంతీయతత్వం, కులం, మతం, రాజకీయాలనే అంశాలే ప్రభావం చూపుతున్నట్టు స్పష్టంగా అర్ధమవుతోంది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన పద్మ అవార్డులు కొంత ఊరట లభించేలా ఉన్నా.. ప్రతిభావంతురాలైన నటి, దర్శకురాలు విజయనిర్మలకు పద్మ అవార్డు ప్రకటించకపోవడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే విజయనిర్మల పేరు ప్రముఖంగా వినిపించడానికి కారణం వెనుక ఈసారి ప్రకటించిన పద్మ అవార్టుల జాబితాలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ పేరు కనిపించడమే. వందేళ్ల భారతీయ సినీ పరిశ్రమ చరిత్ర చూసుకుంటే.. విజయనిర్మల అందించిన సేవలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 55 ఏళ్ల క్రితం 'పాండురంగ మహత్యం' చిత్రంలో బాలనటిగా నటించడం చిత్రరంగ ప్రవేశం చేసిన విజయనిర్మల తన కెరీర్ లో తమిళ, మలయాళ చిత్రరంగాల్లో కలిపి 200 చిత్రాలకు పైగానే నటించారు. అంతేకాకుండా చిత్ర పరిశ్రమలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా ఓ ఘనతను విజయనిర్మల సొంతం చేసుకున్నారు. తన సినీ జీవితంలో 49 చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా రికార్డు సృష్టించడమే కాకుండా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు. తాను సొంతంగా విజయ కృష్ణ బ్యానర్ పై 15 చిత్రాలను రూపొందించారు. అయినా విజయనిర్మల ప్రతిభ, సేవలు ప్రభుత్వాలకు దృష్టికి రాకపోవడం చాలా విచారకరం.
అయితే అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయమేమింటే చేతివేళ్లపై లెక్కించదగిన సంఖ్యలో హిందీ సినిమాల్లో నటించిన, విడుదల కాని ఓ చిత్రానికి దర్శకత్వం వహించిన విద్యాబాలన్ కు పద్మ అవార్డును ప్రకటించిడం పలువురికి షాక్ ఇచ్చింది. 2003లో బెంగాలీ చిత్రం నటించడం ద్వారా, 2005లో పరిణీత చిత్రం ద్వారా బాలీవుడ్ లో విద్యాబాలన్ అడుగుపెట్టింది. కాని పరిణీత, డర్టీ పిక్చర్, కహానీ చిత్రాలకు మినహా చెప్పుకోవడానికి పెద్దగా ఏమిలేని విద్యాబాలన్ కు పద్మ అవార్డు లభించడంపై దక్షిణాదిలో పలువురు సినీనటులు బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కారు.
చిత్ర పరిశ్రమలో సీనియర్ నటులను ప్రభుత్వం విస్మరించడంపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చకు దారి తీసింది. అలనాటి నటి శ్రీప్రియ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దక్షిణాదిలో జమున, కృష్ణకుమారి, లక్ష్మి లాంటి నటీమణులను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోకపోవడం బాధకరమని శ్రీప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. తాజా ఆరోపణలను ఆధారంగా చేసుకుని.. ప్రభుత్వ తీరు పరిశీలిస్తే, లాబీయింగ్ ద్వారానే పద్మ అవార్డులు సొంతం చేసుకోవచ్చు అనే విమర్శకు బలమిచ్చింది. పైరవీలు, లాబీయింగ్ ఉంటే చాలు పద్మ అవార్టులు దక్కించుకోవచ్చు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీనియర్ల ప్రతిభాపాటవాలను పరిగణనలోకి తీసుకోకపోవడంపై అనేక విమర్శలకు తావిస్తోంది. వివిధ రంగాల్లో వ్యక్తులు, కళాకారులు అందించిన కృషిని, సేవల్ని, ప్రతిభను కొలమానంగా తీసుకోవాలని పలువురు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇకనైనా పద్మ అవార్డులను వివాదాల చుట్టుముట్టకుండా.. వాటి గౌరవాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
-రాజబాబు అనుముల