సాక్షి, కడప: ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికే మూడు డెంగీ కేసులు నమోదయ్యాయి. పులివెందుల సమీపంలోని నల్లపురెడ్డిపల్లి, కమలాపురం, కొండాపురంలో ముగ్గురికి డెంగీ సోకినట్లు మలేరియా అధికారులు నిర్ధారించారు. రాయచోటి, చక్రాయపేట, సుండుపల్లి, లక్కిరెడ్డిపల్లి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పెద్దముడియం ప్రాంతాలలో విషజ్వరాల తీవ్రత మొదలైంది. ప్రస్తుతం జిల్లాలో 177 మందికి మలేరియా, 213 మందికి టైఫాయిడ్ సోకినట్లు అధికారులు చెబుతున్నారు. వర్షాకాలం కావడం, వాతావరణంలోని మార్పులు, చిత్తడి నేలలతో దోమల వృద్ధి అధికంగా ఉండటంతోనే జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి.
ఈక్రమంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి చర్యలు తీసుకోవడంలో ఓవైపు పంచాయతీ అధికారులు, మునిసిపల్ అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తోంటే మరో వైపు ఇప్పటి వరకూ మలేరియా నియంత్రణకు ఎలాంటి మందును పిచికారీ చేయకుండా మలేరియా నియంత్రణశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మునిసిపల్ అధికారులు కూడా ఇప్పటి వరకూ ఎక్కడా ఫాగింగ్ చేయలేదు. గంబూషియా చేపలను మురికి కాల్వల్లోకి వదల్లేదు. తీరా జ్వరాలు సోకిన తర్వాత వైద్యసాయం చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నద్ధంగా లేవు. మందుల కొరతతో గ్రామాల్లోకి ఏఎన్‌ఎంలు వెళ్లాలంటేనే వెళ్లలేని పరిస్థితి. కనీసం గ్రామాల్లో వైద్యశిబిరాలు కూడా నిర్వహించడం లేదు. ప్రజలు కూడా సర్కారు చికిత్సపై నమ్మకం లేక జ్వరం వస్తే చాలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.
ఎప్పుడు కళ్లు తెరుస్తారో..:
అధికారుల నిర్లక్ష్యంతో గతేడాది డెంగీ దెబ్బకు 23మంది బలయ్యారు. ఇందులో 11మంది చిన్నారులు ఉన్నారు. కేవలం డెంగీ సోకిందని గుర్తించడంలో ఆలస్యం, ఆ తర్వాత చికిత్స చేయడంలో నిర్లక్ష్యంతోనే వారంతా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అయితే అధికారులేమో ఒక్కరు మాత్రమే డెంగీ దెబ్బకు బలయ్యారని వాదించారు. ప్రస్తుతం జ్వరాల విజృంభణ మొదలుకావడంతో ఎవరికైనా డెంగీసోకితే యాథావిధిగా తిరుపతి, కర్నూలు, హైదరాబాద్, వేలూరులకు తరలించాల్సిందే! ఎందుకంటే రిమ్స్‌లో డెంగీ నివారణ కోసం 1.50కోట్ల రూపాయలతో ప్లేట్‌లెట్ కౌంటింగ్ మిషన్‌ను తెప్పించారు. అయితే డెంగీ సోకిన వ్యక్తి రిమ్స్‌కు వెళితే చికిత్స మాత్రం చేయలేని స్థితి. దీనికి కారణం ఓ వ్యక్తి రక్తంలోని ప్లేట్‌లె ట్లను రోగి శరీరంలోకి ఎక్కించేందుకు ‘ఎన్-బ్లాక్’ అనే ప్రత్యేక యూనిట్ అవసరం. దీని విలువ 7,500 రూపాయలు మాత్రమే.
అయితే ఇది రిమ్స్‌లోగాని, జిల్లాలోగాని అందుబాటులో లేదు. దీన్ని డెంగీ సోకిన రోగి తెచ్చుకోవాలి. అత్యవసరంగా ఇది కావాలంటే హైదరాబాద్, చెన్నై నుంచి తెప్పించాలి. దీనికి రవాణా ఖర్చులు మరో 20వేల రూపాయలవుతాయి. ఇంత ఖర్చయినా అక్కడి నుంచి మన జిల్లాకు వచ్చే లోపు రోగి బతికి ఉంటాడా? చనిపోతాడా? అనేది దేవుడే నిర్ణయించాలి. ఇదొక్కటి చాలు సర్కారు వైద్యం ఎంత డొల్లగా ఉందో తెలుసుకోవడానికి. డెంగీ సోకితే దానికి అందుబాటులో లేని ‘ఎన్-బ్లాక్’ను రోగి తెచ్చుకుంటేనే చికిత్స చేస్తామని వైద్యాధికారులు అంటున్నారంటే...ఇక ‘రిమ్స్’ ఎందుకు? వైద్య, ఆరోగ్యశాఖ ఎందుకు అనే భావన జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోంది.
యూనిట్ రోగి తెచ్చుకోవాల్సిందే: సిద్ధప్ప గౌరవ్, డెరైక్టర్, రిమ్స్.
డెంగీని నయం చేసేందుకు అవసరమైన సామగ్రి మన వద్ద ఉంది. అయితే ఎన్-బ్లాక్‌ను రోగి తెచ్చుకోవాలి. ఇది ఇక్కడ దొరకదు. హైదరాబాద్, చెన్నైలో దొరుకుతుంది. గతేడాది రెండు తెప్పించాం. ఇద్దరికి చికిత్స చే శాం. ప్రస్తుతం రిమ్స్‌లో లేవు. డెంగీ సోకిన వ్యక్తి ఆ యూనిట్లను తెచ్చుకుంటే ఇక్కడే మంచి చికిత్స అందిస్తాం.
చర్యలు కట్టుదిట్టం చేస్తున్నాం: త్యాగరాజు, మలేరియా నియంత్రణ అధికారి.
గత ఏడాది డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతోనే ఈ ఏడాది ఇప్పటికే 40మంది సీరాన్ని పరీక్షలకు పంపించాం. మలేరియా నియంత్రణకు ఫాగింగ్ చేయాలి. కానీ ఇప్పటి వరకూ మనకు ఫాగింగ్ మందు పంపిణీ కాలేదు. త్వరలోనే ఫాగింగ్ చేసేలా చర్యలు తీసుకుంటాం.
పారిశుద్ధ్య నివారణ చర్యలు తీసుకుంటాం: మురళీ కృష్ణ గౌడ్, ఆర్డీ, మునిసిపల్ కార్పొరేషన్,
వర్షాకాలం కావడంతో పారిశుద్ధ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఫాగింగ్‌తో పాటు గంబూషియా చేపలను కాలువల్లో వదిలేలా కమిషనర్లను ఆదేశిస్తాం. నివారణకు అన్ని చర్యలు తీసుకుంటాం.
జ్వరమొచ్చింది
Published Thu, Nov 14 2013 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
Advertisement
Advertisement