
ఓటర్లకు శుభవార్త.. జిల్లాలో ఓటర్ల జాబితా సవరణకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 2020 ఓటర్ల తుది జాబితా ప్రకటనకు కసరత్తు ప్రారంభించింది. ఇంటింటి సర్వే సహా ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించింది. దీని ప్రకారం జాబితా పారదర్శకంగా రూపొందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
సాక్షి, అమరావతి : ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నిర్దేశిత షెడ్యూల్ మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలని ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 2020 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆగస్టు 31 వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న వారి వివరాలను సెప్టెంబర్‌లో బీఎల్‌వోలు ఇంటింటికీ తిరిగి పరిశీలించనున్నారు. ఇది పూర్తి చేసిన తర్వాత అక్టోబర్ 15న మధ్యంతర ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. అప్పటికీ ఓటర్లుగా నమోదు చేసుకోని వారికి అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు తుది అవకాశాన్ని కల్పించనున్నారు. డిసెంబర్ 15లోగా అభ్యంతరాలను స్వీకరించి డిసెంబర్ 25న మరోసారి జాబితాను ప్రచురించనున్నారు. తుది పరిశీలన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తర్వాత వచ్చే ఏడాది జనవరిలో తుది జాబితా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంటింటి సర్వే..
ఓటరు జాబితా సవరణలో భాగంగా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి 30 వరకు ఇంటింటి సర్వే చేస్తారు. బూత్‌లెవల్ అధికారులు (బీఎల్వోలు) తమ వద్ద ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారు. స్థానికంగా నివాసం లేనప్పటికీ ఇక్కడ ఓటరు జాబితాలో పేర్లుంటే వాటిని గుర్తించనున్నారు. సెప్టెంబరు 15వ తేదీ నుంచి అక్టోబరు 15 వరకు పోలింగ్ కేంద్రాల వివరాలు సేకరిస్తారు. ఎక్కడైనా పోలింగ్ కేంద్రాలు మార్పు చేయాల్సి ఉంటే ఆ వివరాలను నమోదు చేస్తారు. పోలింగ్ కేంద్రాల చిరునామాలు తప్పుగా నమోదైతే వాటిని సరి చేస్తారు. బీఎల్వోలు, రిటర్నింగ్ అధికారులు ఈ ప్రక్రియ చేపట్టి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరుకు నివేదిక అందజేస్తారు.
అక్టోబరు 15న ముసాయిదా ప్రకటన
ఈ ఏడాది అక్టోబరు 15వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటిస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాలు, వీటి పరిధిలో ఓటర్ల వివరాలు ప్రకటిస్తారు. అదే రోజు నుంచి 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్లుగా చేర్చుకునేందుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2020 జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు కోసం ఆన్‌లైన్‌లో లేదా బీఎల్వోలు, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 30వ తేదీ వరకు నూతన ఓటర్ల దరఖాస్తులను స్వీకరిస్తారు. వీటిని డిసెంబరు 15వ తేదీ లోపు పరిశీలిస్తారు. డిసెంబరు 25 లోపు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పరిశీలన చేసి తప్పులుంటే సరి చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి జనవరిలో ఎన్నికల కమిషన్ సూచించిన తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు.
తప్పులు సరిదిద్దేందుకు..
ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికల సమయంలో ఓటర్ల జాబాతాను హడావుడిగా తయారు చేసి తుది జాబితా ప్రకటించారు. వాటిలో ఒకే కుటుంబానికి చెందిన పేర్లు పలుమార్లు ఓటర్ల జాబితాల్లో నమోదయ్యాయి. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రెండుసార్లు నమోదైన ఓటర్ల పేర్లను ప్రస్తుతం జరిగే ఓటర్ల జాబితాల సవరణల్లో తొలగిస్తారు. జాబితాలో ఓటర్ల పేర్లు తప్పుగా నమోదైతే వాటిని సరిదిద్దుతారు. ఓటరు ఫొటో గతంలో లేకుంటే చేరుస్తారు. హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఓటర్లు తమ పేర్లు, ఫొటోలు అడ్రసు, సక్రమంగా ఉన్నాయా.? లేదా .? అన్నది పరిశీలించుకోవచ్చు.