కడప సెవెన్‌రోడ్స్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట మార్చిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జరుగుతున్న నిరాహార దీక్షా శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న విషయం విభజన బిల్లులోనే స్పష్టంగా ఉందని పేర్కొన్నారు.
కాగా బీజేపీ నేత వెంకయ్యనాయుడు విభజన చట్టంలో లేదని చెప్పడం శుద్ద అపబ్దమని దుయ్యబట్టారు. నాటి యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రకు ఐదేళ్లపాటు స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ ఇస్తామని ప్రకటించగా, దాన్ని పదేళ్లకు పెంచాలంటూ ఆనాడు మాట్లాడిన వెంకయ్యనాయుడు నేడు మాట మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తీసుకు రావాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రానిపక్షంలో ఎన్డీయే నుంచి చంద్రబాబు తక్షణమే బయటికి రావాలని డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ సీపీఎం మినహా అన్ని పార్టీలు విభజనకు అనుకూలంగా మాట్లాడాయన్నారు. విభజన సందర్బంగా ఆంధ్ర రాష్ట్రానికి నష్టం వాటిల్లకూడదన్న ఉద్దేశ్యంతో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటించారన్నారు. బహుళ ప్రయోజనాలతో సుమారు రూ. 5 లక్షల కోట్లు విలువజేసే హామిలతో చట్టబద్దమైన భరోసా ఇచ్చారన్నారు.
కేంద్రంలో ప్రభుత్వాలు మారినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ది విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరగకూడదన్న ఉద్దేశ్యంతో 2014 మార్చి 1వ తేది కేంద్ర మంత్రివర్గం ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానించి ప్లానింగ్ కమిషన్‌కు ఆదేశాలు పంపిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. పదేళ్లు ప్రత్యేక హోదాకు అప్పట్లో పట్టుబట్టిన వెంకయ్యనాయుడు నేడు ఇతర రాష్ట్రాలు కూడా అంగీకరించాల్సి ఉంటుందని చెప్పడం ఆయన రెండు నాల్కల ధోరణిని వెల్లడిస్తోందని తూర్పారబట్టారు.
ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తర కోస్తాలకు ప్రత్యేక ప్యాకేజీని సాధించలేని చంద్రబాబు సిగ్గూఎగ్గు లేక ఎన్డీయేలో కొనసాగుతున్నారంటూ దుమ్మెత్తి పోశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సురేష్‌బాబు, డిప్యూటీ మేయర్ నబీరసూల్, కాంగ్రెస్ నాయకులు సత్తార్, గొర్రె శ్రీనివాసులు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బండి జకరయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు.