తమ్ముళ్లకు షాక్
- రూ.5 లక్షలకు పైబడిన నీరు-చెట్టు పనులను టెండర్ పద్ధతిలోనే కేటాయించాలి
- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- జీవో 62ను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం
- జిల్లాలో రూ.30 కోట్ల విలువైన పనులు నిలిచే పోయే ప్రమాదం?
- తెలుగు తమ్ముళ్లలో గుబులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: నీరు-చెట్టు పనుల కేటాయింపులో ప్రభుత్వానికి చుక్కెదురైనట్లు సమాచారం. నిబంధనలు తుంగలో తొక్కి, ఇష్టానుసారంగా జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్లకు నామినేషన్‌పై రూ.కోట్ల పనులు కట్టబెట్టారు. పనుల కేటాయింపులో జరిగిన అవకతవకలపై జిల్లాకు చెందిన బి.సుబ్రమణ్యం అనే కాంట్రాక్టర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు డబ్ల్యూపీ నంబరు 20541-2015 రిట్ దాఖలు చేశారు. దీనిపై గురువారం వాదనలు జరిగాయి. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు జీవో నంబరు 62 ప్రకారం రూ.5 లక్షలకు పైగా విలువ కలిగిన నీరు-చెట్టు పనులను ఈ-ప్రొక్యూర్‌మెంట్, టెండరు పద్ధతి ద్వారానే కేటాయించాలని ప్రభుత్వానికి సూచిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాదులు కె.మోహన్‌రామిరెడ్డి, పి.మునిరెడ్డి తెలిపారు.
తెలుగు తమ్ముళ్లపై ప్రభావం
ఇప్పటికే జిల్లావ్యాప్తంగా నామినేషన్ పద్ధతిపై గత మే 28 నాటికి రూ.48.49 కోట్ల విలువ కలిగిన 775 పనులు చేస్తున్నట్లు పిటిషనర్ కోర్టులో దాఖలు చేసిన రిట్‌లో పొందుపరిచారు. ఇందులో రూ.5 లక్షల పైగా విలువగల పనులు సుమారు రూ.30 కోట్ల పనులు ఉన్నట్లు సమాచారం. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం ఈ పనులపై పడే అవకాశం ఉంది. మొదటి రెండు దశల్లో జేసీబీ యజమానులతో ఒప్పందం కుదుర్చుకుని వారి పేరుతో అగ్రిమెంట్ చేసి పనులు కేటాయించేవారు. మూడు, నాలుగు, ఐదో దశల్లో జన్మభూమి కమిటీల పేరుతో సర్పంచ్‌లు, మండల కమిటీ తీర్మానాలను తుంగలో తొక్కి నేరుగా తెలుగు తమ్ముళ్లలకు లబ్ధి కలిగేలా నామినేషన్ పద్ధతిపై పనులు కేటాయించారు.
రేటు పెరగడంతో..
క్యూబిక్ మీటర్ మట్టి పనికి గతంలో రూ.29 చెల్లిస్తుండగా, దాన్ని ప్రభుత్వం రూ.40కి పెంచింది. దీంతో పనుల కోసం టీడీపీ నేతలు ఎగబడుతున్నారు. ఇటీవలే కోట్ల రూపాయల పనులకు కలెక్టర్ ఆమోద ముద్ర వేశారు. జిల్లావ్యాప్తంగా రూ.150 కోట్ల పనులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో రూ.5 లక్షలకు పైగా విలువ కలిగిన పనులు దాదాపు 1,000కి పైగా ఉన్నట్లు సమాచారం. వీటి విలువ 70 కోట్ల పైగా ఉంటుందని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం మీద హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మే 28వ తేదీ వరకు మంజూరు అయిన పనులకు వర్తిస్తాయా, లేక ప్రస్తుతం మంజూరయిన అన్ని పనులకు వర్తిస్తాయా అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఈ విషయమై ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీరామకృష్ణను వివరణ కోరగా నీరు-చెట్టు పనులకు సంబంధించి తమకు హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందజేయలేదన్నారు. కోర్టు ఉత్తర్వులు వస్తే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.