అందరూ కలసికట్టుగా విభజనను అడ్డుకోవాలి: జగన్ పిలుపు
హైదరాబాద్: రాష్ట్రాన్ని విడదీయటానికి చేస్తున్న కుట్రలను తెలుగు ప్రజలంతా కలిసి అడ్డుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. లోటస్ పాండ్‌లో ఈరోజు తనను కలిసిన సమైక్యాంధ్ర అడ్వకేట్స్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
జగన్ ప్రసంగ పాఠం: రాయలసీమ, కోస్తాఆంధ్ర, తెలంగాణ అన్నిప్రాంతాలు సమైక్యంగా ఉండాలని మనం అడుగుతున్నాం. పెద్దదిగా ఉంటేనే రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. 60 శాతం మంది ప్రజలు మాకు అన్యాయం జరిగిందని రోడ్డు ఎక్కారు. ఆ అన్యాయం పార్టీలకు, కేంద్రానికి కనిపించడంలేదా?
రాష్ట్రాన్ని విభజిస్తే పది జిల్లాలలో తన్నుకునే పరిస్థితి వస్తుంది. న్యాయం చేయలేనప్పుడు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎవ్వరికీ ఆమోదం కాకపోయినా విభజన ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజాయితీగా విభజనను అడ్డుకోవాలి. ఓట్లు, సీట్లు పోతాయని మౌనంగా ఉండటం మంచిదికాదు. విభజనను ఆపకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. రెండు రాష్ట్రాలుగా విడగొడితే నీళ్లు ఎలా ఇస్తారు? నాగార్జున సాగర్, శ్రీశైలంకు నీల్లు ఎలా వస్తాయి? కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మంచినీళ్లు ఎవరు ఇస్తారు? రాష్ట్రం ఒకటిగా ఉంటేనే నీటి సమస్య రాదు.
చదువుకున్న ప్రతి కుర్రవాడు ఉద్యోగం కోసం హైదరాబాద్ వైపే చూస్తున్నాడు. రాష్ట్ర ఆదాయంలో సగం హైదరాబాద్ నుంచే వస్తోంది. అదే ఆగిపోతే జీతాలు ఎలా ఇస్తారు? రాష్ట్రాన్ని విడగొట్టవద్దని జెఏసీ ద్వారా లేఖ రాయండి, నేను తొలి సంతకం పెడతాను అని చెప్పాను. అందరం కలిస్తేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది. పంపకాల్లో తండ్రి పిల్లలకు న్యాయం చేయాలి. న్యాయం చేయలేనప్పుడు యథావిథిగా వదిలివేయాలి. సిపిఎం, ఎంఐఎం, వైఎస్ఆర్ సిపి మూడు పార్టీలు సమైక్యాంధ్ర కోరుతున్నాయి. మిగిలిన పార్టీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలో నిజాయితీ లోపించింది. ప్రతి సమైక్యవాది, జెఏసి సభ్యుడు టిడిపిని అడగండి. ఆ తరువాత టిడిపిని కూడా జేఏసిలోకి రానివ్వండి.