
హైదరాబాద్‌పై పెత్తనంలేని తెలంగాణ మాకెందుకు?
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లోని శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్ తప్పుపట్టారు. హైదరాబాద్‌పై అధికారాల్లేకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఉపయోగమేముందని ప్రశ్నించారు. సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర పెద్దల తీరు చూస్తుంటే రాష్ట్రం విభజించిన తరువాత హైదరాబాద్‌లో ఇల్లు నిర్మించాలన్నా....మరే చిన్న అనుమతి అవసరమైనా గవర్నర్ వద్దకు వెళ్లమని చెబుతున్నట్లుగా ఉందని అన్నారు.
రాష్ట్ర విభజన తరువాత కూడా సీమాంధ్ర ఉద్యోగులంతా ఇక్కడే కొనసాగడమంటే60 ఏళ్లుగా చేస్తున్న తెలంగాణ ఉద్యమానికి ఫలితం లేకుండా చేయడమేనని మండిపడ్డారు. అధికారాలు లేని తెలంగాణ తమకేమీ వద్దని, పనికిరాని ప్రతిపాదనలతో చెలగాటమాడితే తెలంగాణ ప్రజలు మళ్లీ ఉద్యమిస్తారని హెచ్చరించారు. పుట్టగతుల్లేని సీమాంధ్ర నేతలకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇవ్వడంవల్లే ఎమ్మెల్యేలు, మంత్రులుగా కొనసాగుతున్నారని, అలాంటి నేతలు రాష్ట్రాన్ని విభజిస్తే పార్టీకి పుట్టగతులుండవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.