రాజీనామా చేయం: బొత్స సత్యనారాయణ
రాజీనామా చేయం: బొత్స సత్యనారాయణ
Published Mon, Aug 5 2013 2:54 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో తమ పదవులకు రాజీనామాలు చేసేది లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు. రాజీనామాలు చేస్తే శాసనసభలో సమైక్యవాణి ఎవరు వినిపిస్తారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం మంత్రుల నివాస ప్రాంగణంలో బొత్స మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సమైక్యంగా ఉంచాల్సిందేనని సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశంలో రూపొందించిన తీర్మానంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తాను కూడా సంతకాలు చేసిన మాట వాస్తవమేనన్నారు. ‘‘శనివారం జరిగిన సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యుల సమావేశంలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, ఈ విషయంలో హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తీర్మానం చేశాం. విభజిస్తే సీమాంధ్రలో ఉత్పన్నమయ్యే సమస్యలు, నీటి వనరులు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, హైదరాబాద్ పరిస్థితి ఏమిటని? దీనిపై విధాన నిర్ణయం కావాలని అందులో పేర్కొన్నాం. ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం, శాంతిభద్రతల సమస్య, ఉద్యోగుల సమస్య వంటివి కూడా అందులో ఉన్నాయి. ఈ తీర్మానాన్ని హైకమాండ్‌కు పంపుతా’’ అని వివరించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసవుతుందని చెప్పడానికి తానేమీ జ్యోతిష్యుడిని కాదని.. దీనిపై ఊహాజనిత సమాధానాలు చెప్పలేనని అన్నారు. విభజన జరిగితే రాజధాని ఎక్కడ ఉండాలి? ఎలా ఏర్పాటు చేయాలనేది అప్రస్తుతమన్నారు. సీమాంధ్రలోని 5 కోట్ల మంది ప్రజలు ఎదుర్కొంటున్న ఉద్యోగ, ఉపాధి, విద్యావకాశాల సమస్యలను ఎలా అధిగమిస్తామనేది ఆలోచిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోనే అన్ని అత్యున్నత సంస్థలను ఏర్పాటు చేసినందున ఈ సమస్య ఏర్పడిందన్నారు. ‘‘దేశంలో ఏ తల్లికి పుట్టిన బిడ్డ అయినా ఎక్కడైనా నివసించే అధికారం ఉంది. ఎవరి దయాదాక్షిణ్యాలపైనో బతకాల్సిన అవసరం మాకు లేదు. కేసీఆర్ కానీయండి, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కానీయండి.. అసలు భరోసా ఇవ్వడానికి మీరెవరు? మీ దయాదాక్షిణ్యాలు ఎవరిక్కావాలి?’’ అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రాజకీయ లబ్ధి కోసం జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇకపై కాంగ్రెస్‌పై నిందలు వేసినా, విగ్రహాలను విధ్వంసం చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలంతా వెంటనే ప్రతిఘటించాలని బొత్స పిలుపునిచ్చారు.
Advertisement