కిరణ్, బాబు ముఖం ఎందుకు చాటేస్తున్నారు?
బీఏసీకి డుమ్మాపై శోభానాగిరెడ్డి సూటిప్రశ్న
సాక్షి, హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ బీఏసీ సమావేశానికి రాకుండా ఎందుకు ముఖం చాటేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత భూమా శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. బిల్లుపై ఓటింగ్ ఉంటుందా?, లేదా? అనేదానికి ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహచర ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, కాపు రామచంద్రారెడ్డి, కె.శ్రీనివాసులుతో కలిసి ఆమె గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
‘‘బిల్లుపై ఓటింగ్ విషయమై శాసనసభలో అడిగితే బీఏసీలో చెప్పాం కదా అని స్పీకర్ అంటారు. ఇదే విషయమై బీఏసీలో అడిగితే జవాబుండదు. గట్టిగా నిలదీస్తే ప్రభుత్వం నుంచి వాయిదా తీర్మానం ఇస్తే చేస్తామంటారు. అయితే ప్రభుత్వం తీర్మానం ఇస్తుందా? లేదా? అనేది తనకు సమాచారం లేదంటారు. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందో సీఎం చెప్పరు. బీఏసీ సమావేశానికి ముఖం చాటేసి మోసపూరిత విధానాన్ని అవలంబిస్తున్నారు. చంద్రబాబు కూడా బీఏసీ సమావేశానికి ముఖం చాటేసి పార్టీకి చెందిన ఇరు ప్రాంత నేతలను పంపి రెండు వాదనలు వినిపిస్తున్నారు’’ అని మండిపడ్డారు. రెండు పార్టీలూ రెండు రకాల అభిప్రాయాలు చెబుతూ... సిగ్గులేకుండా తమను విమర్శిస్తున్నాయని ఆమె దుయ్యబట్టారు.
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు: విభజన బిల్లుపై తమ పార్టీ చర్చకు వ్యతిరేకం కాదని, అయితే దానిపై ముందు ఓటింగ్ నిర్వహించాకే చేపట్టాలని మొదట్నుంచీ డిమాండ్ చేస్తున్నామని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గొల్ల బాబూరావు, కాపు రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు మీడియాపాయింట్లో వేర్వేరుగా మాట్లాడారు. బిల్లుపై కాంగ్రెస్ ఆలోచనలకనుగుణంగా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. సీఎం కిరణ్ పదవి కాపాడుకునేందుకు నాటకాలాడుతున్నారన్నారు. చర్చలో టీడీపీ తీరుచూస్తుంటే కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యాయని స్పష్టమవుతోందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ముందుగా బాబు వైఖరేంటో వెల్లడించాక మాట్లాడాలని డిమాండ్ చేశారు.
.