వితంతు పింఛన్లు పునరుద్ధరించండి | Widow pensions Restart | Sakshi
Sakshi News home page

వితంతు పింఛన్లు పునరుద్ధరించండి

Published Tue, Dec 23 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

Widow pensions  Restart

 కాకినాడ సిటీ : జిల్లాలో ఎక్కడైనా వితంతు పింఛన్లు సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయి ఉంటే వాటిని వెంటనే పునరుద్ధరించాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ డీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ డ్వామా హాలులో ఆమె ప్రజావాణి క్యాక్రమం నిర్వహించారు.  జిల్లా వ్యాప్తంగా సుమారు 350 మంది ప్రజలు పాల్గొని తమ సమస్యలపై వినతులు అందజేశారు. తమ పింఛన్లు ఆగిపోయాయని కొంత మంది వితంతువులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిపై స్పందించారు.   ఒక మహిళ తమ చిన్నారికి గుండె ఆపరేషన్ అవసరం ఉందని చెప్పగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ను చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రజావాణిలో రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు, పింఛన్లు, రుణమాఫీ సమస్యలపై అర్జీలు ఎక్కువగా వచ్చాయి.
 
 డయల్ యువర్ కలెక్టర్‌కు 26 ఫోన్‌కాల్స్
 కలెక్టరేట్ కోర్టుహాలు నుంచి ఉదయం కలెక్టర్ నీతూ ప్రసాద్ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించగా సుమారు 26 మంది జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ చేసి సమస్యలు వివరించారు. కిర్లంపూడి మండలం నుంచి ఒక వ్యక్తి కలెక్టర్‌కు ఫోన్ చేసి మండలంలో గడచిన 10 రోజుల నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు రవాణా జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ మెట్ట ప్రాంతంలోని 10 మండలాల్లో ఇసుక లభ్యం అవుతున్నందున ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్, ఇతర అధికారులతో ప్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి అక్రమ తవ్వకాలు రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
 
 అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తాను గతంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నానని దానికి పట్టా ఇవ్వాలని డయల్ యువర్ కలెక్టర్‌లో కలెక్టర్‌ను కోరాడు. దీనిపై కలెక్టర్ స్పందించి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు ఎలా నిర్మించుకుంటారని ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే అల్లవరం తహశీల్దార్‌కు ఫోన్ చేసి ప్రభుత్వ స్థలం ఆక్రమించుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని, తక్షణం ఆక్రమణను తొలగించి వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, అదనపు జాయింట్ కలెక్టర్ మార్కెండేయులు, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
 
 నేటి నుంచి జన్‌ధన్‌పై డివిజన్‌స్థాయిలో క్యాంపులు
 కాకినాడ సిటీ : బహుళ ప్రయోజనాలు ఉన్న ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద అన్ని కుటుంబాలకు బ్యాంక్ అకౌంట్లు తెరిచేలా డివిజన్ స్థాయిలో మెగా క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. సోమవారం రాత్రి కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ పథకంలో ప్రతి కుటుంబానికి రెండు బ్యాంక్ అకౌంట్లు ఉండాలన్నారు. జిల్లాలో 44 లక్షల మంది బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారని, ఇంకా లక్ష కుటుంబాలకు అకౌంట్లు లేవన్నారు.
 
 మంగళవారం నుంచి మెగా క్యాంపులు డివిజన్ స్థాయిలో చేపడుతున్నామని, రంపచోడవరం ఆంధ్రా బ్యాంక్ ప్రాంగణంలోను, అమలాపురంలోని అంబేద్కర్ భవన్‌లో మంగళవారం నిర్వహిస్తారన్నారు. 24న పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం, రామచంద్రపురంలోని వీఎస్‌ఎం కళాశాల ఆడిటోరియం, 26న కాకినాడ అంబేద్కర్ భవన్, రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో క్యాంపులు జరుగుతాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, ఆంధ్రాబ్యాంక్‌డీజీఎం శేషగిరిరావు, ఎల్‌డీఎం జగన్నాథస్వామి, వ్యవసాయశాఖ జేడీ విజయ్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నందారావు పాల్గొన్నారు.  
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement