'జపాన్తోనూ రాజధాని నిర్మాణంపై చర్చిస్తాం'
హైదరాబాద్: రైతుల డిమాండ్లపై పరిశీలన చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో నియమ నిబంధనలపై అధికారులతో తాము చర్చించామని ఆయన అన్నారు. ఈ విషయమై వారం రోజుల్లో ఖరారుచేస్తామని అధికారులు చెప్పినట్టు తెలిపారు. సీఆర్డీఏకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, సీఆర్డీఏపై ఆర్డినెన్స్ ఆలోచన చేస్తున్నామన్నారు. సింగపూర్లో రాజధానిపై ప్రత్యేక చర్చ చేశామన్నారు.
రాజధాని డిజైన్ను ఇవ్వాలని సింగపూర్ను చంద్రబాబు కోరినట్టు మంత్రి నారాయణ చెప్పారు. రాజధానిపై సింగపూర్ చాలా పాజిటివ్గా ఉందన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా అక్కడ కూడా రాజధాని నిర్మాణం అంశాన్ని చర్చిస్తామన్నారు. జపాన్తో కలిసి పనిచేయడానికి సింగపూర్ కూడా ఆస్తకి చూపిందని ఆయన తెలిపారు. రాజధాని పరిధిలో మొత్తం మూడు రింగ్స్ వస్తాయని చెప్పారు. మొదటి రింగ్ 75కిలోమీటర్లు, రెండో రింగ్ 125 కిలోమీటర్లు, మూడో రింగ్ 225 కిలీమీటర్లు ఉంటుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.