
'ఆరు నూరైనా పోటీ నుంచి తప్పుకునేది లేదు'
హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల బరిలో నుంచి వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్సీ చైతన్య రాజు స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన అన్నారు. కాగా పోటీ నుంచి తప్పుకోవాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గతరాత్రి చైతన్య రాజుకు ఫోన్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సీఎం కోరగా...అందుకు చైతన్య రాజు సున్నితంగా తిరస్కరించినట్లు సమచారం. ఈ సందర్భంగా చైతన్యరాజు బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ తాను పోటీ నుంచి తప్పుకుంటే సీమాంధ్ర ప్రజలను మోసం చేసినట్లు అవుతుందని అన్నారు.
ఇక పెద్దల సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్‌గా మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన చైతన్యరాజు బరి నుంచి తప్పుకునేలా అధిష్టానం ఒత్తిడి పెంచుతోంది. నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు గురువారంతో ముగియనుండటంతో ఈలోగా రెబల్స్‌ను బరి నుంచి తప్పుకునేలా ఒప్పించగలుగుతామనే ధీమాతో పార్టీ రాష్ట్ర నేతలున్నట్టుగా కన్పిస్తోంది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పార్టీ పెద్దలు చైతన్యరాజుపై పలు రకాలుగా ఒత్తిడి తీసుకురాగా, ఆరు నూరైనా తాను రాజ్యసభ బరి నుంచి వెనక్కు తగ్గేది లేదని చైతన్యరాజు చెబుతున్నారు.