గుంటూరు : గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలో 16 జాతీయ రహదారిపై శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న టీ దుకాణంలోకి దూసుకువెళ్లింది.ఈ ప్రమాదంలో దుకాణంలోని మహిళ అక్కడికక్కడే మరణించింది. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం గుంటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.