పని ఒత్తిడితో సతమతమవుతున్న ప్రధానోపాధ్యాయులు
ఒకేసారి ఆరు రకాల పనులతో సతమతం
కార్తీక వన మహోత్సవానికి లక్ష పేర్లు
నమోదు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు
స్కూళ్లలో కంప్యూటర్లున్నా నెట్ సదుపాయం లేక ఇక్కట్లు
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉన్నత పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయుల నెత్తిన ప్రభుత్వం ఒకేసారి ఆరు రకాల బాధ్యతల బరువు పెట్టింది. ఇప్పటికే రోజువారీ విధుల నిర్వహణతో సతమతమవుతున్న ప్రధానోపాధ్యాయులు ఈ అదనపు బాధ్యతలతో బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం అప్పగించిన పనులన్నింటినీ ఆన్‌లైన్ ద్వారా చేయాల్సి రావడం, పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక ఆందోళనకు గురవుతున్నారు. చైల్డ్ ఇన్ఫో ప్రాజెక్టులో భాగంగా విద్యార్థుల వివరాలను ఆధార్‌తో సహా పంపాల్సి ఉంటుంది. దీంతోపాటు జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సెల్ నంబర్లు, మధ్యాహ్న భోజన నిర్వహణకు సంబంధించిన రోజువారీ నివేదికలను జిల్లా అధికారులకు ఆన్‌లైన్ ద్వారా పంపాలి.
ఆన్‌లైన్ కష్టాలు
ఈనెల 25న కార్తీక వన మహోత్సవం రోజున జిల్లాలోని పాఠశాలల్లో మొక్కలు నాటాలని నిర్ణయించిన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గుంటూరు జిల్లావ్యాప్తంగా లక్షమంది విద్యార్థులను ఏపీ గ్రీన్ కార్ప్స్ కింద నమోదు చేయాలని విద్యాశాఖాధికారులు ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లా నలుమూలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షమంది విద్యార్థుల పేర్లు, తల్లిదండ్రుల ఆధార్, సెల్ నంబరు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. కాగా, గుంటూరు జిల్లాలోని 145 ఉన్నత పాఠశాలల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ లేకపోవడంతో హెచ్‌ఎంలే కంప్యూటర్ ఆపరేటర్ విధులు నిర్వహించాల్సి రావడం ఇబ్బందిగా మారింది.
‘టెన్త్’తో తంటాలు
మార్చిలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల వివరాలను ఈ ఏడాదిలోనే ఆన్‌లైన్‌లో పంపాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 10వ తరగతి పరీక్షకు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్క విద్యార్థి వ్యక్తిగత వివరాలు, ఆధార్ నంబరు, సబ్జెక్టు, మీడియం వివరాలతో నామినల్ రోల్స్‌ను పూర్తిగా ఆన్‌లైన్‌లో పంపాలని స్పష్టం చేయడంతో హెచ్‌ఎంలు తలలు పట్టుకుంటున్నారు. 10వ తరగతి పరీక్షలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి దాదాపు 30వేల మంది విద్యార్థులు హాజరనుకానుండగా, వీరికి సంబంధించిన వివరాలను హెచ్‌ఎంలే ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంది.
ఆర్థిక అవస్థలెన్నో..
గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం, సమీపంలో నెట్ సెంటర్లు అందుబాటులో లేకపోవడంతో హెచ్‌ఎంలు పట్టణ కేంద్రాలకు వచ్చి ప్రైవేటు నెట్ సెంటర్లపై ఆధారపడుతున్నారు. ఫలితంగా విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో పంపేందుకు ఒక్కో హెచ్‌ఎం వ్యక్తిగతంగా రూ.వందల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఖర్చు చేసిన నిధులు ప్రభుత్వం తిరిగి చెల్లించే అవకాశం లేకపోవడంతో హెచ్‌ఎంలు ఒకవైపు పని ఒత్తిడి, మరోవైపు ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నా నెట్ సదుపాయం లేకపోవడం, ప్రభుత్వం ఏడాదికి ఇంటర్నెట్ బిల్లుల రూపంలో చెల్లించే నిధులు సరిపోకపోవడం, ఒకదానిపై మరొకటి అన్న చందంగా హెచ్‌ఎంల నెత్తిన కొండంత బాధ్యత బరువు పెరిగింది.
సమీక్షా సమావేశాల్లో సమస్యలు ఏకరువు
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు రోజులు నిర్వహించిన డివిజన్ స్థాయి సమీక్షా సమావేశాల్లో ప్రధానోపాధ్యాయులు తాము పడుతున్న సమస్యలను అధికారుల ఎదుట ఏకరువు పెట్టారు. కార్తీక వన మహోత్సవం, టెన్త్ ఆన్‌లైన్, చైల్డ్ ఇన్ఫో తదితర అంశాలపై మంగళ, బుధవారాల్లో బాపట్ల, గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి, నరసరావుపేట డివిజన్ల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలతో డీఈవో శ్రీనివాసులురెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో పలువురు హెచ్‌ఎంలు ప్రభుత్వం తమపై మోపిన బాధ్యతలు, క్షేత్రస్థాయిలో ఇబ్బందులను ప్రస్తావించారు.
హెచ్‌ఎంల నెత్తిన బాధ్యతల బండ
Published Fri, Nov 20 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM
Advertisement