జగనాభిమానం
ఎప్పటిలాగే జిల్లా జనం వైఎస్ కుటుంబానికి అండగా నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ జగన్‌పై అభిమానం చూపారు. సీమాంధ్రలోని 13జిల్లాలలో ఎక్కడా లేని విధంగా 10 అసెంబ్లీ స్థానాల్లో 9 మందిఎమ్మెల్యేలను తిరుగులేని మెజార్టీతో గెలిపించి..వైఎస్ కుటుంబంపై తమది చెరగని ప్రేమ అని చాటిచెప్పారు. వైఎస్సార్‌సీపీ గెలుపుతో ఆపార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాకపోవడంతో ఢీలాపడ్డారు. ప్రజలతీర్పును శిరసావహించి, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామని విజయానంతరం ప్రకటించారు. కార్యకర్తలకు కష్టనష్టాల్లోఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పారు.
సాక్షి, కడప: సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ శుక్రవారం నిర్వహించారు. కడప పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు జేఎంజే కాలేజీలో, రాజంపేట పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాలకు రిమ్స్ డెంటల్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్‌బ్యాలెట్లను లెక్కించారు. తర్వాత రౌండ్లవారీగా ఈవీఎంలోని ఓట్లను గణించారు. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో రాజంపేట మినహా తక్కిన అన్ని అసెంబ్లీస్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
కడప పార్లమెంట్ పరిధిలోని అన్నిస్థానాలు వైఎస్సార్‌సీపీకి క్లీన్‌స్వీప్ అయ్యాయి. రాజంపేట పార్లమెంట్‌లోని రాజంపేట స్థానంలో మాత్రం టీడీపీ విజయం సాధించింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి విజయం సాధించారు. తక్కిన రాయచోటి, రైల్వేకోడూరు స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. పదేళ్లపాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌పార్టీ జిల్లాలో ఒక్కస్థానంలో కూడా విజయం సాధించకపోగా ఎక్కడా మెజార్టీని కూడా దక్కించుకోలేదు. కొత్తగా ఆవిర్భవించిన జై సమైక్యాంధ్రపార్టీతో పాటు ఆమ్‌ఆద్మీ, బీఎస్‌పీ, ఎన్‌సీపీలాంటి జాతీయపార్టీలకు కూడా మెజార్టీ దక్కలేదు.
రెండుపార్లమెంట్‌లు వైఎస్సార్‌సీపీకే:
కడప, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థులు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విజయం సాధించారు. రాజంపేట స్థానానికి కేంద్ర మాజీమంత్రులు సాయిప్రతాప్ కాంగ్రెస్ తరఫున, బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి బరిలో నిలిచారు. మిధున్‌రెడ్డి చేతిలో ఇద్దరూ ఓడిపోయారు. కడప టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి ఆర్. శ్రీనివాసులరెడ్డి(వాసు)పై 1,93,365 ఓట్ల తేడాతో వైఎస్ అవినాష్‌రెడ్డి గెలుపొందారు. అలాగే పురందేశ్వరిపై 1.75లక్షల ఓట్లతో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విజయం సాధించారు. వైఎస్ కుటుంబం నుంచి వచ్చిన అవినాష్‌కే మరోసారి కడప ఎంపీ స్థానాన్ని ప్రజలు కట్టబెట్టారు. మాజీమంత్రి పెద్దిరామచంద్రారెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డిని కూడా భారీ మెజార్టీతో గెలిపించారు. యువనేతలైన వీరిరువురు తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారు.
జిల్లాలో నుంచి ఆరు కొత్త ముఖాలు అసెంబ్లీకి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జిల్లా నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు తొలిసారి ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టనున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు కమలాపురం, ప్రొద్దుటూరు, కడప, బద్వేలు ఎమ్మెల్యేలు తొలిసారి గెలిచారు. వీరంతా ఎమ్మెల్యేగా పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించడం విశేషం. అలాగే రాజంపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన మేడా మల్లికార్జునరెడ్డి కూడా అసెంబ్లీ గడపను తొలిసారి తొక్కనున్నారు.
హ్యాట్రిక్ వీరులు...హ్యాట్రిక్ ఓటములు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ‘హ్యాట్రిక్’ సాధించారు. 2004, 2009, 2014లో ఎమ్మెల్యేగా ఆది విజయం సాధించారు. 2009, 2011 ఉప ఎన్నిక లతో పాటు ప్రస్తుతంశ్రీకాంత్, కొరముట్ల గెలుపొంది ‘హ్యాట్రిక్’ జాబితో చేరారు. అలాగే కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి వరుసగా మూడుసార్లు ఓడిపోయి ‘హాట్రిక్’ ఓటమిని మూటగట్టుకున్నారు. అలాగే మాజీ మంత్రి పీ రామసుబ్బారెడ్డి కూడా 2004,2009, 2014లో ఓడిపోయి ‘హ్యాట్రిక్’ జాబితో చేరారు.
పెద్దాయన గెలిచారు...‘పుట్టా’ ట్రిక్కులు ఓడిపోయాయి
జిల్లాలో మైదుకూరు అసెంబ్లీస్థానంపై జిల్లా వాసులు ప్రత్యేక దృష్టి సారించారు. పుట్టా సుధాకర్‌యాదవ్ నియోజకవర్గంలో ధనప్రవాహం పారించారు. ఓటుకు వెయ్యిరూపాయల డబ్బు, ముక్కుపుడకలు పంపిణీ చేశారు. మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సహకారం తీసుకున్నారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం ‘పెద్దాయన’గా పిలువబడే రఘురామునికే పట్టం కట్టారు. పుట్టా సొంత పంచాయితీ పలుగురాళ్లపల్లె, డీఎల్ స్వగ్రామం సుంకేసులలో కూడా రఘురామునికే మెజార్టీ వచ్చింది.
వైఎస్ జగన్‌కు భారీ మెజార్టీ:
ఎప్పటిలాగే పులివెందుల ప్రజానీకం వైఎస్ కుటుంబానికి మరోసారి పట్టం కట్టారు. తొలిసారి అసెంబ్లీబరిలో నిలిచిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 75,243 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
కడప పార్లమెంట్‌కు 14మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఏ అభ్యర్థి ఇష్టం లేదని నోటాకు పోలైన ఓట్లు: 6058.
సమీరాకు...230 ఓట్లు:
జిల్లాలో తొలిసారి అసెంబ్లీబరిలో సమీరా (హిజ్రా) పోటీకి దిగారు. జమ్మలమడుగు నియోజకవర్గం బరిలో సమీరా ఆమ్‌ఆద్మీపార్టీ తరఫున బరిలోకి దిగారు. ఈమెకు 230 ఓట్లు పోలయ్యాయి.