ఏలూరుపై 'పెద్దాయన' చెరగని ముద్ర | Y S Rajasekhara Reddy mark in west godavari | Sakshi
Sakshi News home page

ఏలూరుపై 'పెద్దాయన' చెరగని ముద్ర

Published Sun, Jul 8 2018 8:32 AM | Last Updated on Sun, Jul 8 2018 8:34 AM

Y S Rajasekhara Reddy mark in west godavari - Sakshi

జిల్లాకు కష్టమంటే క్షణం ఆలస్యం చేసేవారు కాదు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. వెంటనే నిధులు మంజూరు చేసి ఆదుకునేవారు. అంతేకాదు దేశానికే గర్వకారణంగా నిలిచిన పోలవరం ప్రాజెక్టును జిల్లాకు వరంగా ఇచ్చారు. కొవ్వాడ కాలువ వద్ద స్లూయిస్‌ నిర్మించి ఆ ప్రాంతాల్లోని పంటలకు ముంపు తప్పించారు. ఏలూరులో తమ్మిలేరు గట్లు పటిష్ట పరచి ఏలూరు నగరానికి రక్షణగా నిలిచారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల్లో లబ్ధిపొందిన వారు నేటికీ ఆయన్నే స్మరిస్తూ గుండెల్లో గుడి కట్టి పూజిస్తున్నారు. నేడు ఆ మహానేత వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఊరూవాడా ఘన నివాళి అర్పించేందుకు సిద్ధమయ్యారు. 

ఏలూరు టౌన్‌:  దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైనది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరం. ఇక్కడ ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే వచ్చి స్వయంగా పరిశీలించేవారు. ఏలూరు నగరానికి భారీ తాగునీటి జలాశయాన్ని నిర్మించేందుకు నిధులిచ్చారు. పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ వేల ఇళ్లను కట్టించారు. ఏలూరు దుఃఖదాయనిగా పేరుగాంచిన తమ్మిలేరు వరదల నుంచి శాశ్వత పరిష్కారం చూపించారు. వైఎస్సార్‌ అనుంగు శిష్యుడిగా పేరున్న అప్పటి ఎమ్మెల్యే, నేటి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్లనాని) ప్రజల కోసం ఏది అడిగానా లేదు అనకుండా ప్రతి పనిని చేసి చూపెట్టిన ప్రజా నాయకుడు వైఎస్సార్‌. 

తాగునీటి కష్టాలకు చెక్‌
ఏలూరు నగరపాలక సంస్థగా ఆవిర్భావానికి ముందు ప్రజల తాగునీటి కష్టాలు చెప్పనలవి కావు. ఏలూరులోని 18 మురికివాడల్లోని ప్రజలైతే గుక్కెడు నీటికోసం రోజుల తరబడి వేచి చూసేవారు. ప్రధాన ప్రాంతాల్లో భూగర్భనీటిపైనే ఆధారపడి బోర్లు ద్వారా తాగునీటిని సరఫరా చేసేవారు. ఇక వేసవి కాలం వస్తుందంటే జనాల గొంతు తడారేది. ఇలాంటి గడ్డు పరిస్థితికి పరిష్కారం చూపించారు డాక్టర్‌ వైఎస్సార్‌. ఏలూరు శివారులో భారీస్థాయిలో సుమారు రూ.120 కోట్లు వెచ్చించి, 118 ఎకరాల మంచినీటి జలాశయాన్ని నిర్మించేందుకు వైఎస్‌ నిధులు మంజూరు చేశారు. ఆళ్లనాని ఎమ్మెల్యేగా స్థలాన్ని సేకరించి, చెరువు ఏర్పాటు చేసి రెండు, మూడు దశాబ్దాల వరకూ నగర ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేశారు. 

దుఃఖదాయనికి అడ్డుకట్ట వేశారు
ఏలూరు దుఃఖదాయనిగా పేరుగాంచిన తమ్మిలేరు వరదలు ప్రజలను వణికించేవి. ఏలూరు నగరాన్ని రెండుగా విడిపోయి చుట్టేసే తమ్మిలేరు ఎప్పుడు ముంచేస్తుందో అని భయంతో జీవించేవారు. దివంగత మహానేత వైఎస్సార్‌ రెండు, మూడు సార్లు తమ్మిలేరు వరదలను స్వయంగా వచ్చి పరిశీలించారు కూడా. అప్పటి ఎమ్మెల్యే ఆళ్లనాని పరిస్థితిని వైఎస్సార్‌కు వివరించారు. ఈ వరదలకు అడ్డుకట్ట వేయాలంటే తమ్మిలేరు ఏటిగట్లను పటిష్టం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. తమ్మిలేరు ఏటిగట్లను పటిష్టం చేసేందుకు, రివిట్‌మెంట్‌ చేసేందుకు వైఎస్‌ భారీగా నిధులు మంజూరు చేశారు. సుమారు రూ.90 కోట్లతో ఏటిగట్లను పటిష్టం చేసి వరద ముంపు తొలగించారు. 

పేదోడి సొంతింటి కల సాకారం 
ఏలూరు నియోజకవర్గంలో పేదల సొంతింటి కలను నిజం చేశారు వైఎస్సార్‌. ఇందిరమ్మ కాలనీలో 9 వేల కటుంబాలకు పక్కా ఇళ్లు కట్టించారు. మరో 10 వేలకు పైగా పేద కుటుంబాలకు స్థలాలు మంజూరు చేశారు. పోణంగిలో వైఎస్సార్‌ కాలనీ పేరుతో 1800 ఇళ్లను కట్టించారు. ఏలూరు నగరంలో స్థలాన్ని సేకరించి పేదలకు భారీ సంఖ్యలో ఇళ్లు కట్టించిన రికార్డు ఎమ్మెల్యే ఆళ్లనానిదే! ఏలూరు వన్‌టౌన్‌ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీకి కూడా వైఎస్‌ నిధులు కేటాయించారు. ఆయన మరణానంతరం ఆ పనులు జరగలేదు. 

ఆయనతో స్నేహం ఎప్పటికీ మరువలేను : వట్టి
భీమడోలు: దివంగత సీఎం వైఎస్సార్‌ తొలిసారిగా జిల్లాలోని నా ఉంగుటూరు నియోజకవర్గంలోనే 2004లో పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన చేశారని, ఆ మధుర క్షణాలు మరచిపోలేనని రాష్ట్ర మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ తెలిపారు. వైఎస్సార్‌తో ఉన్న అనుబంధం ఆయన మాటల్లోనే.. నేను విద్యార్థి నాయకునిగా విశాఖపట్నం నుంచి వైఎస్‌కు పరిచయమయ్యాను. ఆ పరిచయం స్నేహంగా మారింది. అలాగే కేవీపీ రామచంద్రరావు కాకినాడ నుంచి స్నేహితుడయ్యాడు. అప్పట్లో శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు పర్యటించిన ప్రతిసారి నా కారులోనే వైఎస్‌ను తిప్పేవాణ్ణి. ఆ సమయంలో నేనే కారు నడుపుతూ ఆయనకు సేవ చేసే భాగ్యం కలగడం మరపురాని అనుభూతి. ఆయన సాన్నిహిత్యంతో నేను నేర్చుకున్న ప్రతీది నేటికీ నేను నా జీవితంలో పాటిస్తున్నాను. ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయాను.

అధ్యక్షా.. ఏమిటి విశేషాలు అనేవారు : జీఎస్‌ రావు 
నిడదవోలు :  ‘వయస్సులో నా కన్నా చిన్నవారైనా దివంగత మహనేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి నన్ను ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. మేము ఎప్పుడు కలిసినా ‘అధ్యక్షా ఏమిటి విశేషాలు’ అనేవారు.. అని వైఎస్సార్‌ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జీఎస్‌ రావు మహానేతతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్‌ సమక్షంలో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాను. 2008లో వైఎస్‌ సీఎంగా ఉండగా పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశాను. ఎవరికి ఏ కష్టం వచ్చినా వైఎస్‌ సాయం చేసేవారు. 1999లో జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నాకు టిక్కెట్‌ ఇచ్చారు. జిల్లాలో కాంగ్రెస్‌ తరఫున 16 నియోజకవర్గాల్లో 15 నియోజకవర్గాలు ఓటమి పాలయ్యాయి. ఒకే ఒక చోట కొవ్వూరు నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ఒక్కడినే గెలుపొందాను. ఈ విజయంతో వైఎస్సార్‌ ఎంతో అభినందించారు. అప్పటి నుంచి ఎప్పుడు కలిసినా వెస్ట్‌ గోదావరి చాంపియన్‌ అంటూ పిలిచేవారు. వెఎస్సార్‌ స్వర్ణయుగం వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో అతి త్వరలో రానుంది. 

చెక్కు చెదరని అభిమానం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) /కొవ్వూరురూరల్‌:  దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానాన్ని కళాకారులు తమ రీతిలో చాటుకున్నారు. ఏలూరుకు చెందిన సూక్ష్మరూప కళాకారుడు మేతర సురేష్‌ మహానేత నిలువెత్తు విగ్రహాన్ని అగ్గిపుల్లపై చెక్కి అబ్బుర పరిచారు. అలాగే కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన పెన్సిల్‌ ఆర్ట్‌ చిత్రకారుడు అడ్డాల నాని మహానేతతో పాటు ఆయన కుమారుడు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూపాలను చిత్రీకరించారు. పెన్సిల్‌తో గీసిన ఈ చిత్రం ఆకట్టుకుంది.  

మా పాలిట దేవుడు 
ఆరేళ్ల క్రితం నాకు గుండెపోటు వస్తే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఆరోగ్యశ్రీలో స్టంట్‌ వేశారు. మొదట ఆసుపత్రికి వెళ్లినప్పుడు రూ.5 వేలు కట్టించుకున్నారు. ఆరోగ్యశ్రీ వర్తించిన ఐదురోజులకు నా సొమ్ములు నాకు ఇచ్చేశారు. కేవలం తెల్లరేషన్‌కార్డు పట్టుకువెళ్తే రూ.70 వేల విలువైన ఆపరేషన్‌ ఉచితంగా చేశారు. ఇదంతా ఆ మహానుభావుడు రాజశేఖరరెడ్డి దయే!
–బోనాల వెంకట సత్యసాయి శర్మ, పురోహితులు, కొవ్వూరు 

నా కాలు చక్కబడింది 
మా ఇంటి గోడ 2008లో కూలిపోయిన ఘటనలో ప్రమాదవశాత్తు నా కాలు విరిగింది. వైద్యం చేయించుకునే స్తోమత లేదు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఉందని సన్నిహితులు తెలపడంతో వైద్యం చేయించుకున్నాను. ఇటీవల నా భర్త మృతి చెందడంతో కొంత అనారోగ్యానికి గురయ్యాను. 
–ఇంటి రత్నం, గృహిణి, పాలకొల్లు 

ప్రాణం నిలిపిన మహానేత 
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వల్ల నా ప్రాణం నిలబడింది. 2009లో అనారోగ్యంగా ఉంటే హార్ట్‌బీట్‌ తక్కువగా ఉందని వైద్యులు చెప్పారు. భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారం రోజులు ఉన్నాను. గుండెకు స్టంట్‌ వేయాలన్నారు. ఖర్చు కోసం భయపడ్డాం. కానీ ఆరోగ్యశ్రీ ఉండటంతో నా గుండెకు రక్షణ ఏర్పడింది. ఆపరేషన్‌ ఉచితంగా చేయడంతో పాటు ఏడాది పాటు మందులు కూడా ఇచ్చారు. అందుకే రాజశేఖరరెడ్డిని మా గుండెల్లో నిలుపుకున్నాం. 
–మరడాన రాంబాబు, ఆర్‌ఎంపీ, పాలకొల్లు 

వైఎస్‌ మరణాన్ని తట్టుకోలేక నా భర్త చనిపోయారు 
నా భర్త వెంకట సత్యనారాయణ వ్యవసాయ కూలీ. వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో ప్రాణంగా ఉండేవారు. వైఎస్‌ మరణ వార్త విని ఆవేదనకు గురై ప్రాణాలు విడిచారు. మాకు నలుగురు పిల్లలు. దీంతో మా కుటుంబం దిక్కుతోచనిస్థితిలో ఉంది. ఆయన కుమారుడు జగనన్న మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆదుకుని కొండంత ధైర్యాన్ని ఇచ్చారు.
–కుక్కల పద్మ, గృహిణి, పాలకొల్లు 

గుండె ఆపరేషన్‌ చేయించుకున్నా.. 
నేను వ్యవసాయ పనిచేస్తుంటాను. 2008లో అనారోగ్యానికి గురైతే గుండెకు ఆపరేషన్‌ చేయాలని వైద్యులు చెప్పారు. ఆరోగ్యశ్రీలో చేయించుకున్నాను. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నాడు వైఎస్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీయే. 
–అంబటి వెంకటేశ్వరరావు, రైతు, పాలకొల్లు 

మా కుటుంబమంతా రుణపడ్డాం 
వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుకున్న కుటుంబాల్లో మాది ఒకటి. 2009లో ఆరోగ్యశ్రీ ద్వారా నేను ఆపరేషన్‌ చేయించుకున్నాను. మా అబ్బాయి జయ రామకృష్ణ, అమ్మాయి శ్రీదేవి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్ల ఇంజినీరింగ్‌ చేశారు. రూ.4 లక్షల వ్యవసాయ రుణమాఫీ పొందాం. వైఎస్‌ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు మాకు ఉపయోగపడ్డాయి. ఆయన్ని ఎప్పటికీ మరువం. 
 –పాలా కనకరాజు, రైతు, పాలకొల్లు 

నన్ను బతికించారు 
నా పేరు ఉర్దల సన్యాసమ్మ. ఈ రోజు బతికి ఉన్నాను అంటే మహానుభావుడు వైఎస్సార్‌ వల్లే.. 15 ఏళ్లుగా కడుపులో కణితితో బాధపడేదాన్ని. వైఎస్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల 2008లో భీమవరం ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్‌ చేయించుకున్నాను. నా కడుపులోంచి వైద్యులు 28 కిలోల కణితిని తొలగించారు. వైఎస్‌ వల్లే నేను ఆరోగ్యంగా ఉండి ప్రస్తుతం కూలి పనులకు వెళ్తున్నాను. 
–ఉర్దల సన్యాసమ్మ, భీమవరం 

రాజన్న వల్లే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరయ్యా..
నేను పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివా. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఉచిత కార్పొరేట్‌ విద్య పథకం వల్ల ఇంటర్మీడియట్‌ అనంతరం బీటెక్‌ పూర్తి చేయగలిగాను. మంచి మార్కులతో ఇంజినీరింగ్‌ పాసయ్యాను. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎన్‌పీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలవ వల్ల మా కుటుంబానికి ఆర్థికంగా ఆసరా లభించింది. 
–మోటుపల్లి విజయ్‌కుమార్, నరసాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement