
సాక్షి, విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్నట్టు పొత్తులు దేశప్రయోజనాల కోసం కాదని తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమని గన్నవరం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావ్ తెలిపారు. చంద్రబాబుకి ఎవరోఒకరితో పొత్తుండాలని, 6 నెలలు కూడా ఒంటరిగా పార్టీని నడపలేకపోయాడని పేర్కొన్నారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు.
సేవ్ డెమోక్రసీ అంటూనే ఆ నాడు ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారని యార్లగడ్డ వెంకట్రావ్ మండిపడ్డారు. మళ్లీ సేవ్ డెమోక్రసీ అంటూ కాంగ్రెస్ పార్టీతో కలిశారన్నారు. అసలు సేవ్ డెమోక్రసీ అంటే ఏంటో చంద్రబాబుకి తెలుసా, పక్క పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడమా..? ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడమా..? అంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు తీరుకు ఎన్టీఆర్, హరికృష్ణ ఆత్మలు క్షోభిస్తాయన్నారు. రాజధానిని సింగపూర్‌కి తాకట్టు పెట్టి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్‌కి తాకట్టు పెట్టారన్నారు.