ముమ్మిడివరం: గుర్తు తెలియని యువకుడిని హత్య చేసి గుర్తు పట్టకుండా అతడి ముఖం కాల్చి వేసి మురుగు నీటి కాలువలో పడవేసిన సంఘటన ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లిలో చోటు చేసుకుంది. అమలాపురం–అయినాపురం మురుగునీటి కాలువ సీహెచ్ గున్నేపల్లి వంతెన వద్ద యువకుడిని హత్య చేసి పడేశారు. ఆదివారం రాత్రి సమయంలో హత్య చేసి కాలువలో పడవేసినట్టు స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. యువకుడి తలపై బలమైన ఆయుధంతో కొట్టి ఆపై ఈడ్చుకుంటూ కాలువ గట్టుపైకి తీసుకు వచ్చి మృతదేహం గుర్తు పట్టకుండా ముఖంపై కొబ్బరి ఆకులతో మంట వేసి కాల్చి వేసినట్టు అక్కడ ఆధారాలను బట్టి తెలుస్తోంది. యువకుడిని ఈడ్చుకుంటూ వచ్చినట్టు రక్తపు మరకలు ఉన్నాయి.
ఒంటిపై నలుపు రంగు ప్యాంటు, గోధుమ కలర్ షర్ట్ ధరించి ఉన్న ఇతడి వయస్సు సుమారు 35 ఏళ్లు ఉంటాయి. గ్రామ ఇన్‌చార్జ్ వీఆర్‌ఓ దార్ల వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ముమ్మిడివరం సీఐ కేటీవీవీ రమణారావు, ఎస్‌బీ ప్రభాకర్ సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి దగ్గరలో ఉన్న ఒక షాపులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. కాకినాడ నుంచి క్లూస్ టీం డాగ్ స్కాడ్‌లను రప్పించారు. సీఐ ఎం.అర్జునరావు బృందం వేలిముద్రలను సేకరించారు. పోలీసు జాగిలం బ్రోనో ట్రైనర్ ఓ.రమణ ఆధారాల కోసం ప్రయత్నించారు. పోలీసు జాగిలం సంఘటన స్థలం నుంచి స్థానిక ఆక్వా చెరువుల వద్ద గెస్టు హౌస్ మార్గం పల్లంకుర్రు రోడ్డు సమీపంలో ఓఎన్‌జీసీ సైటు వరకు వెళ్లి అక్కడ కొద్ది సేపు ఉండి అక్కడ సమీపంలో ఉన్న సత్తెమ్మ ఆలయ పరిసరాల్లో ఆగింది. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment