
నాన్న వద్దకే వెళ్తున్నా..
సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య
బనవాసిలో యువకుడి అఘాయిత్యం
ఎమ్మిగనూరు రూరల్ : ‘నాన్న, అన్న నిత్యం కలలోకి వస్తున్నారు.. నన్ను రమ్మంటున్నారు.. వారంటే నాకు చాలా ఇష్టం.. వారి వద్దకే వెళ్లాలని నిర్ణయించుకున్నా.. ఇలా చేస్తున్నందుకు నన్ను క్షమించండి’ అని సూసైడ్ నోట్ రాసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు బనవాసి గ్రామానికి చెందిన హనుమంతు. ఉద్యోగ సాధనలో భాగంగా కోచింగ్ తీసుకుంటున్న అతడు ఉన్న ఫలంగా ఆత్మహత్య చేసుకోవడంపై కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. వివరాలు.. మాధవరం మండలం సింరాజన్‌పల్లెకు చెందిన లక్ష్మణ్ణ, నాగమ్మకు దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె. భర్త కొన్నేళ్ల క్రితమే మృతి చెందడంతో నాగమ్మ పుట్టినిల్లు బనవాసికి వచ్చి అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో మతిస్థిమితం కోల్పోయిన పెద్దకుమారుడు ఏడాదిన్నర క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.
డిగ్రీ పూర్తి చేసుకున్న మరో కుమారుడు హనుమంతు ఎప్పుడూ తండ్రి, సోదరున్ని గుర్తుకు తెచ్చుకుని బాధపడుతుండేవాడు. డిగ్రీ పూర్తి చేసుకున్న హనుమంతు కర్నూలులో గ్రూప్స్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం అన్న కుమారులు బాబాయ్‌ను చూడాలంటే ఇంటికి వ చ్చాడు. పిల్లలు, కుటుంబీకులతో సోమవారం రాత్రి వరకు నవ్వుతూ, నవ్విస్తూ గడిపిన హనుమంతు రాత్రి స్నేహితుల గదికి వెళ్లి పడుకున్నాడు. అప్పటికే థిమెట్ గుళికలు మింగి ఉండడంతో తెల్లారేసరికి మరణించాడు.
రాత్రి 12 గంటల సమయంలో క ళ్లు తిరుగుతున్నట్లు చెప్పడంతో మంచినీళ్లు తాపించామని స్నేహితులు తెలిపారు. రూరల్ ఎస్‌ఐ వేణుగోపాల్ అక్కడకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదు, నాన్నా, అన్నలు రమ్మంటుంటే వెళ్తున్నాని సూసైడ్ నోట్ రాసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్నామన్నారు.