సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై శుక్రవారం శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యుత్ కొనుగోళ్లుపై గత ప్రభుత్వ విధానాలను ఆధారాలతో సహా ఎండగట్టారు. ప్రతి విషయంలోనూ కుక్కతోక వంకరే అన్న విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి సభలో మాట్లాడుతూ...‘ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో భారీగా అవకతవకలు జరిగాయి. గత ప్రభుత్వం అవసరం లేకున్నా అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసింది.
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే టీడీపీ సర్కారు హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై సమీక్షించేందుకు కమిటీ వేశాం. అయితే ఆ నిపుణుల కమిటీపై చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారు. నివేదిక రాకుండానే అజేయకల్లం, విద్యుత్ కార్యదర్శిపై ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిపుణుల కమిటీ విచారణ ఇంకా కొనసాగుతోంది. పీపీఏలపై సమీక్ష అనగానే చంద్రబాబు భయపడి పోతున్నారు. ఏపీఈఆర్సీ మన రాష్ట్రానికి ఆర్పీవోలను నిర్దేశిస్తోంది. 2015-16లో ఆర్పీఓ 5 శాతం నిర్ణయిస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 5.5 శాతం కొనుగోలు చేసింది. 2016-17లో ఆర్పీఓ అయిదు శాతం నిర్ణయించగా, 8.6 శాతం కొనుగోలు చేసింది. ఇక 2017-18లో ఆర్పీఓ 11శాతం నిర్ణయిస్తే 23.4శాతం కొనుగోలు చేసింది. దీంతో 2016-17లో రూ.430 కోట్లు, 2017-18లో రూ.924.9 కోట్లు, 2018-19లో రూ.1292.8 కోట్లు ప్రభుత్వంపై అదనంగా భారం పడింది. ఎక్కువ రేట్లకు కొనుగోలు చేస్తున్నామని తెలిసి... కొన్ని కంపెనీలకు లాభం చేకూరేలా ఈ ఒప్పందాలు జరిగాయి. టీడీపీ ప్రభుత్వం రూ.2654 కోట్లకు విద్యుత్ కొనుగోలు చేసింది.
అవసరం లేకున్నా గత ప్రభుత్వం కావాల్సిన కంపెనీలతో అధిక రేట్లకు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు వల్ల ఏటా రూ. 2,766 కోట్ల నష్టం. ఈ భారాన్ని మోసే పరిస్థితుల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు లేవు. పీపీఏలను సమీక్షించి, రేట్లు తగ్గించి ప్రజలకు,ప్రభుత్వానికి న్యాయం చేస్తాం.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2019
చదవండి: కరెంట్ కొనుగోళ్లపై సమీక్షతో.. ప్రజాధనం ఆదా
విండ్ పవర్‌ను యూనిట్‌కు రూ.4.84కు ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీఈఆర్సీ ధరల ప్రకారం థర్మల్ పవర్ యూనిట్ రూ.4.20కి అందుబాటులో ఉంది. అయినా థర్మల్ పవర్‌ను కాదని చంద్రబాబు విండ్ పవర్‌ను కొనుగోలు చేశారు. థర్మల్ పవర్‌ను తీసుకోకపోయినా... యూనిట్‌కు రూ.1.10 పైసలు చెల్లించాల్సి వచ్చింది. మొత్తంపై యూనిట్ ధర రూ.5.94కు కొనుగోలు చేసినట్లు అయింది. దీనివల్ల యూనిట్ రూ.1.74పైసలు నష్టపోయాం. ఏడాదికి రూ.2766కోట్లు అదనంగా చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకే విద్యుత్ దొరుకుతున్నా మనం ఎందుకు పట్టించుకోలేదు?. దానికి కారణం డబ్బులే. సోలార్ విద్యుత్ కొనుగోలు విధానంలో కూడా ఇలాగే వ్యవహరించారు. విండ్ పవర్‌లో 64 శాతం కొనుగోళ్లు కేవలం ముగ్గురితో జరిగాయి.
నోరెత్తితే టెక్నాలజీ అంటారుగా...
2016-18 మూడేళ్లలో రూ.5,497 కోట్ల విద్యుత్ కొనుగోలు చేశారు. గత మూడేళ్లలో విద్యుత్ కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయి. టెక్నాలజీని తానే కనిపెట్టానని చంద్రబాబు అంటారు. ఆ టెక్నాలజీ ద్వారా ఇంత నష్టం వస్తుందని చంద్రబాబుకు తెలియదా?. తెలిసీ 25ఏళ్లకు ఈ పీపీఏలను ఎలా ఒప్పందం చేసుకున్నారు. కేంద్రం నుంచి ఇన్సెంటీవ్‌లు వస్తున్నాయని చంద్రబాబు అంటున్నారు. గత మూడేళ్లలో కేవలం రూ.540కోట్లు మాత్రమే వచ్చాయి?. ఏపీఈఆర్సీ చైర్మన్‌గా తన వ్యక్తిని తెచ్చుకునేందుకు ....ఆ చట్టాన్ని కూడా మార్చారు. గత అయిదేళ్లుగా ఏపీ పవర్ సర్‌ప్లస్ రాష్ట్రంగా ఉంది. మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎందుకు విద్యుత్ కొనుగోళ్లు చేశారు. పారిశ్రామిక రంగానికి ప‍్రోత్సాహకాలు లేకపోగా ఎక్కువ ధరలకు విద్యుత్ కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా సబ్సిడీ భారం పెరుగుతోంది. అయిదేళ్లలో రెవెన్యూ లోటు రూ.66,361కి చేరింది. ఈ భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేయడం సమంజసమేనా?. ఇంత దారుణంగా టీడీపీ స్కామ్‌లు చేసింది. రాష్ట్రానికి ఇంత నష్టం వస్తుందని చంద్రబాబుకు తెలియదా?’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment