పంటలకు మద్దతు ధర లేక ఏటా అప్పులే మిగులుతున్నాయి లక్షలు పెట్టుబడి పెడితే కనీస దిగుబడి రావడం లేదు: ఉల్లిరైతుల ఆవేదన∙ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అన్నదాతలను ఆదుకుంటాం: వైఎస్ జగన్
కోవెలకుంట్ల: గత రెండేళ్లుగా ఉల్లి పంటలో నష్టాలు వస్తున్నాయని డోన్ నియోజకవర్గంలోని కొత్తచెరువు గ్రామానికి చెందిన ఉల్లిరైతులు వైఎస్‌జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వైఎస్‌జగన్ పాదయాత్రగా బేతంచర్లకు చేరుకోగా గ్రామానికి చెందిన మాధవరెడ్డి, రామకృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మిరెడ్డి, రామచంద్రుడు, జయచంద్రుడు, రాముడు తదితర రైతులు ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని ప్లకార్డులతో ప్రదర్శనగా వెళ్లి ఆయనను కలి శారు. ‘ఉల్లిసాగులో పెట్టుబడుల కోసం ఎకరాకు రూ.లక్ష ఖర్చు చేస్తే ఆరుక్వింటాళ్లకు మించి దిగుబడులు రావడం లేదు.. దీనికి తోడు మార్కెట్లో ధర పడిపోవడంతో మేము నష్టాల ఊబిలో కూరుకుపోయాం.
మార్కెట్లో క్వింటా ఉల్లి కనీసం రూ.500 పలకడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వేరుశనగ, కంది, శనగ పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలవుతున్నామన్నారు. మొన్నటివరకు రూ.8 వేలు ధర పలికిన కంది ప్రస్తుతం రూ.4 వేలకు మించి పలకడం లేదన్నారు. ఏటికేడు అప్పులే మిగులుతుండడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని వారు వైఎస్‌జగన్ ఎదుట వాపోయారు. పంటలకు మద్దతు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని ఆరోపించారు. దీంతో రానురాను వ్యవసాయం భారమవుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. మీరైనా రైతుల తరఫున పోరాడాలని వైఎస్‌జగన్‌ను కోరారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment