సభలో ముఖ్యమంత్రితో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, తదితరులు
విజయనగరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న వసతి దీవెన’ పథకం విజయనగరంలో ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కనీవినీ ఎరుగని రీతిలో జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటా చదువుల దీపాలు వెలిగిస్తేనే ఈ తరంతో పాటు, భావి తరాల తలరాతలు మారుతాయని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఈ సందర్భంగా అయోధ్య మైదానంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పేద కుటుంబంలో ఉన్న వారు పేదరికం దాటి ముందుకు రాలేదని, ఈ పరిస్థితి మారాలని, పేద కుటుంబాల పిల్లలు కూడా గొప్ప చదువులు చదవాలని ఆయన ఆకాంక్షించారు. అందుకే దేశంలోనే ఎక్కడా లేని విధంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
పరేడ్ మైదానంలో ఘనస్వాగతం
తాడేపల్లి నుంచి విశాఖపట్నం మీదుగా నేరుగా విజయనగరం చేరుకున్న సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడి పోలీస్ బ్యారెక్స్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్లో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి వాహన శ్రేణితో బయలు దేరి స్థానిక అయోధ్య మైదానంలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. హెలిప్యాడ్‌నుంచి అయోధ్య మైదానం వరకూ దారిపొడవునా వేలాదిగా జనం థాంక్యూసీఎం సార్ అంటూ చిత్రించిన ప్లకార్డులతో ఘన స్వాగతం పలికారు. అయోధ్య మైదానంలో ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. బహిరంగ సభలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని కంప్యూటర్లో కీ ప్రెస్ చేసి ప్రారంభించారు. అక్కడి నుంచి పోలీసు బ్యారెక్ గ్రౌండ్స్‌కు చేరుకున్న సీఎం అక్కడి దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు.
జన జాతరలా స్వాగతం
తమ అభిమాననేత ముఖ్యమంత్రిగా బాధ్యత లు స్వీకరించిన తరువాత తొలిసారిగా జిల్లాకు వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన వెళ్లే మార్గానికి ఇరువైపు లా బారులు తీరి ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం పదిగంటలకే జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానం నుంచి అయోధ్య మైదానం వరకు చేరేంతవరకూ అన్ని ప్రధాన జంక్షన్లు జనంతో కిటకిటలాడాయి. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ప్రజలంతా మానవహారంగా ఏర్పడి చేతిలో ప్లకార్డులు పట్టుకుని జై జగన్ నినాదాలతో సందడి చేశారు.
వసతి దీవెనకు విద్యల నగరం నుంచే శ్రీకారం
విద్యలనగరంగా పేరుగడించిన విజయనగరం నుంచే జగనన్న వసతిదీవెనకు శ్రీకారం చుట్టడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ జిల్లాపై ఉన్న మమకారాన్ని తెలియజేస్తోంది. ఇప్పటికే విద్యాభివృద్ధి కోసం పలు పథకాలు అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ చదివే విద్యార్థుల వసతి, భోజన ఖర్చులక్సోం కోసం వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వేదికపై నుంచి కంప్యూటర్‌లో బటన్ నొక్కి అర్హతగల విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి తొలి విడతగా రూ.10వేలు చొప్పున నగదును జమచేశారు. ఐడీ కార్డులు, చెక్కులను విద్యార్థులకు అందజేశారు. అనంతరం హరిత విజయనగరం సావనీర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు పలువురు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందజేశారు.
దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం:
నగర పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి పోలీస్ పరేడ్ మైదానంలో నూతనంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. అధునాతన టెక్నాలజీతో నిర్మించిన దిశ పోలీస్ స్టేషన్ మొత్తం పరిశీలించారు. కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి సుచరిత, తానేటి వనిత, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శంకర నారాయణ, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, గొట్టేటి మాధవి, ఎం.వి.వి. సత్యనారాయణ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, డీజీపీ గౌతమ్‌సవాంగ్, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ జి.పాలరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, దిశ ప్రత్యేకాధికారి దీపికాపాటిల్, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, పీడిక రాజన్నదొర, అలజంగి జోగారావు, శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్షి్మ, పార్టీ పాలకమండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, జాయింట్ కలెక్టర్ జేసీ కిషోర్‌కుమార్, జేసీ–2 ఆర్.కూర్మనాథ్, డీసీసీబీ ఛైర్‌పర్సన్ మరిశర్ల తులసి, డీసీఎంఎస్ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి కోలగట్ల శ్రావణి, ఏఎంసీ ఛైర్మన్ నడిపేన శ్రీనివాసరావు, సబ్ కలెక్టర్ టిఎస్ చేతన్, అసిస్టెంట్ కలెక్టర్ కేతన్‌గార్గ్, విజయనగరం నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు తదితరులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
విజయనగరం టౌన్: రాష్ట్రముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో స్ధానిక అయోధ్య మైదానంలో సోమవారం సభాప్రాంగణంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి సభాప్రాంగణానికి రాకముందు నుంచే విద్యార్థులను ఉత్తేజ పరుస్తూ చిన్నారులు చేసిన నృత్యప్రదర్శనలు ఆద్యంతం రక్తికట్టించాయి. రామవరం జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎమ్ వెలమల శ్రీనివాసరావు, యాంకర్ జుహిత(విశాఖ) అద్భుతమైన మాటలతో ఆకట్టుకున్నారు. భగవతీ నృత్యకళామందిర్ చిన్నారులు వినాయక స్తుతితో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం పద పద పోదాం సర్కారు బడికి అంటూ అమ్మఒడి పథకం గురించి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎమ్.హరిజవహర్‌లాల్ పాడిన ‘అమ్మలారా.. ఓ అయ్యలారా’, రాజాం కొండ మీద జానపదం వంటి పాటలకు నృత్య రూపకంలో వివరించారు. జామి, చీపురుపల్లి కేజీబీవీ విద్యార్థులు ‘రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న .. నీ వెంట జనం ప్రభంజనం చూడరన్న’ అంటూ చేసిన ప్రదర్శనలకు కరతాళ ధ్వనులు మిన్నంటాయి. చీపురుపల్లి కేజీబీవీ విద్యార్థులు ‘మనలో ఒక సైనికుడై మనలో ఒక సేవకుడై కదిలే జన నాయకుడై’ అంటూ చేసిన నృత్యం ఆలోచింప జేసింది. జామి కేజీబీవీ విద్యార్థులు ‘అమ్మఒడి పథకం చదువుకోలేని కుటుంబాల్లో వెలుగు నింపి కిరణమంటూ, నవరత్నాలు సిరివర్ణాలు కళ పండించే తొలి చిహ్నాలు అంటూ ముందుకు వచ్చారు. చీపురుపల్లి కేజీబీవీ విద్యార్థులు థింసా డ్యాన్స్‌తో కట్టిపడేశారు. విద్యా కార్యక్రమాలపై గెద్ద వరప్రసాద్ నేతృత్వంలో కళాకారులు అద్భుతంగా పాడారు.
పోలీస్ సేవలు భేష్!
విజయనగరం క్రైమ్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయడంలో విజయవంతమైంది. దారిపొడవునా ప్రజలందరూ ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన తమ అభిమాన నాయకుడ్ని చూడడానికి బారులుతీరారు. వారిని కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించి పోలీసులు అందరి మన్ననలు పొందారు. హెలీప్యాడ్‌లో దిగినప్పటి నుంచి సభా ప్రాంగణం చేరుకునే వరకూ దారిపొడవునా పోలీసులు విస్తృతమైన తనిఖీలతో పాటు బాంబ్‌స్కా్వడ్, డాగ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ విస్తృత తనిఖీలు చేపట్టాయి. జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ప్రత్యేక ఆదేశాలతో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు. హెలీ ప్యాడ్ వద్ద అదనపు ఎస్‌పి ఎన్.శ్రీదేవీరావు, రూట్ బందోబస్తును పార్వతీపురం ఏఎస్‌పి డాక్టర్ సుమిత్ గరుడ్, సభాస్ధలం వద్ద బొబ్బిలి ఏఎస్‌పీ గౌతమీశాలీ, దిశ మహిళా పోలీసు స్టేషన్ వద్ద ఓఎస్‌డీ జె.రామ్మోహనరావు ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. బందోబస్తు నిమిత్తం ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు ఏఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 31 మంది సీఐలు, 98 మంది ఎస్‌ఐలు, 192 మంది ఏఎస్‌ఐ,హెచ్‌సీలు, 600 మంది కానిస్టేబుళ్లు, 85 మంది మహిళా కానిస్టేబుళ్లు, 170 మంది హోంగార్డులు, ఐదు ప్లాటూన్ల ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసు సిబ్బంది, ఐదు స్పెషల్ పార్టీ బృందాలు పాల్గొన్నాయి. ముఖ్యమంత్రి పర్యటించే అన్ని ప్రాంతాలు, రహదారులను డ్రోన్, సీసీ కెమెరాలతో పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సీఎం పర్యటనలో సిత్రాలు
►ఉదయం 10 గంటలకే అయోధ్య మైదానంలోని సభా ప్రాంగణంలోని అన్ని గ్యాలరీలు విద్యార్థులు, మహిళలు, యువతతో నిండిపోయాయి.
►ఉదయం 11.50 గంటలకు అయోధ్య మైదానానికి చేరుకున్న ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించేందుకు సిద్ధమైన రాజకీయ కురువృద్ధుడు పెనుమత్స సాంబశివరాజును అప్యాయంగా పలకరించిన జగన్‌మోహన్‌రెడ్డి ఆ శాలువతో సాంబశివరాజును సత్కరించారు.
► సభా వేదికపై జ్యోతి ప్రజ్వలన సమయంలో మహిళా మంత్రులచే జ్యోతి ప్రజ్వలన చేయించారు.
►నెల్లిమర్ల మండలం బొప్పడాం జిల్లా పరిషత్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న అభిమన్యు ఆంగ్లంలో చేసిన ప్రసంగం ఆద్యంతం కరతాళ ధ్వనులను అందుకుంది.
►ముఖ్యమంత్రి ప్రసంగం 19.58 నిమిషాలు సాగింది. ప్రసంగం ఆధ్యంతం విద్యాభివృద్ధికి ప్రభుత్వ ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు.
► సభా ప్రాంగణం నిండిపోవటంతో మైదానం బయటినుంచే వేలాదిమంది గంటల తరబడి వీక్షించారు.
►ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విజయనగరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగతం– సుస్వాగతం బ్యానర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment