అమర జవానుకు ఇదా గౌరవం?
♦ రాష్ర్టప్రభుత్వ తీరుపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం
♦ కేబినెట్‌లో నివాళులర్పించరా? సీఎం కనీసం పట్టించుకోరా?
♦ ముందు రూ.5 లక్షలు ప్రకటించి చేతులు దులుపుకున్నారు
♦ పరిహారం కోసం మేం దీక్షలు, ధర్నాలు చేయాల్సి వచ్చింది
♦ నేను వస్తున్నాననే రూ. 25 లక్షలు ప్రకటించారు...
♦ సంతాపంగా ఒకరోజు సెలవు ప్రకటించాలి
♦ మాట తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి
♦ ప్రతిపక్షనేత డిమాండ్.. ముస్తాక్ కుటుంబానికి పరామర్శ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సియాచిన్‌లో మంచుకొండలు విరిగిపడి మరణించిన జవాన్ ముస్తాక్ అహ్మద్ విషయంలో రాష్ర్టప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ముస్తాక్ మృతికి కేబినెట్‌లో కనీసం నివాళులు కూడా అర్పించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు దేశం మొత్తం నివాళులు అర్పిస్తుంటే రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముస్తాక్ మరణానికి సంతాప సూచకంగా ఒక రోజు సెలవు ప్రకటించాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నానికి పార్నపల్లె చేరుకున్న జగన్.. అమర జవాన్ ముస్తాక్ పార్థివదేహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
సిగ్గుతో తలదించుకునేలా ప్రభుత్వ తీరు
‘‘ఒక సిపాయి చనిపోతే దేశం మొత్తం ఆయనను గౌరవిస్తూ ఘనంగా నివాళులర్పిస్తోంది. మన రాష్ట్రానికి చెందిన ఓ ముస్లిం పిల్లాడు సిపాయి విధులు నిర్వర్తిస్తూ చనిపోతే మనం ఇంకా ఎక్కువ గౌరవించాల్సిన అవసరం ఉంది. కారణం ఏమిటంటే దేశ భద్రత కోసం ముస్లింలు కూడా ఏ స్థాయిలో కష్టపడుతున్నారో చెప్పే ఉదాహరణ ఇది. అందుకే ఎక్కువగా గౌరవించాల్సిన సందర్భం ఇది. అలాంటి ది ఇక్కడ మన రాష్ట్రం తీరు చూస్తే నిజంగా సిగ్గుతో తలదించుకునేలా ఉంది. మొదట రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. అది కూడా ముఖ్యమంత్రి రారు. పట్టించుకోరు. పక్కన కర్ణాటక రాష్ట్రంలో రూ.25 లక్షలతో పాటు ఇల్లు ఇచ్చారు. పొలాలు ఇచ్చారు. ఉద్యోగాలు ఇచ్చారు. ఆ విషయం గుర్తు చేస్తూ ఇక్కడ ధర్నాలు, దీక్షలు చేయాల్సి వచ్చింది. ఆ కుటుంబ సభ్యులతో పాటు మా ఎమ్మెల్యే కూడా ధర్నాలు, దీక్షలు చేశారు. ఆ తర్వాత నేను ఇక్కడకు వస్తున్నానని తెలిసి పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు.
మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలి..
ముస్తాక్ కుటుంబానికి ప్రభుత్వం సానుభూతితో సహాయం చేయలేదు. అతి కష్టంమీద కేబినెట్‌లో పరిహారం ప్రకటించారు. సిపాయి మృతికి కేబినెట్‌లో కనీసం నివాళులు కూడా అర్పించలేదు. ఒక సిపాయి చనిపోతే రాష్ర్టప్రభుత్వ వ్యవహారం తీరు ఇలా ఉంది. కర్ణాటక రాష్ట్రం తరహాలో మీరు ఎందుకు ప్యాకేజీ ఇవ్వరని ఒత్తిడి చేసిన తర్వాతే వీళ్లు ఒప్పుకున్నారు. మాట తప్పకుండా కనీసం అవైనా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. కర్ణాటక మాదిరిగా ఇల్లు, పొలం, ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయమై.. మానవతా దృక్పథంతో ఆలోచించాలి. దేశభద్రత కోసం ముస్లింలు కూడా ఎంతగా పోరాడుతున్నారో చెప్పవలసిన అవసరం ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఒక రోజు సెలవును ప్రకటించడంతో పాటు దేశం మొత్తం మనవైపు చూసే విధంగా సహాయం ప్రకటించి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. సిపాయి మరణానికి సంతాపసూచకంగా ఒక రోజు సెలవు ప్రకటించండి. కర్ణాటకతో కాదు.. దేశంతో పోటీపడండి. దేశంలోకెల్లా అతి మెరుగైన ప్యాకేజీ ఆ కుటుంబానికి ఇచ్చి ఆదర్శంగా నిలబడండి.’’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు.
గవర్నర్‌తో నేటి సాయంత్రం జగన్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం ఐదు గంటలకు రాజ్‌భవన్‌లో కలవనున్నారు. జగన్‌తోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా గవర్నర్ వద్దకు వెళ్లనున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఇటీవల జరిగిన రైలు దహనం ఘటన, తదనంతరం సీఎం చంద్రబాబు వైఎస్సార్‌సీపీ మీద నిరాధారమైన ఆరోపణలతో చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.