ఆయనకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలి
దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఘతన ముస్తాక్ అహ్మద్‌ది అని వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ముస్తాక్‌కు దేశ ప్రజలంతా ఘనంగా నివాళి అర్పించారన్నారు. ఏపీలో మాత్రం సీఎం చంద్రబాబు ముస్తాక్ మరణంపై చిన్నచూపు చూశారన్నారు. తొలుత ముస్తాక్ కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా మాత్రమే ప్రకటించారని, కర్ణాటకలో హనుమంతప్ప కుటుంబానికి రూ. 25 లక్షలు, ఇల్లు, పొలం, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించడంతో ఆలస్యంగా స్పందించిన చంద్రబాబు ముస్తాక్ కుటుంబానికి రూ. 25 లక్షలు అందించారని వైఎస్ జగన్ చెప్పారు.
ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని కోరారు. దేశ భద్రత కోసం ముస్లిం సోదరుడు ప్రాణాలు అర్పించిన వైనాన్ని చాటి చెప్పాల్సిన సమయం ఇదని ఆయన అన్నారు. ముస్తాక్ మరణానికి నివాళిగా ఒకరోజు సెలవు దినంగా ప్రకటించాలని ఆయన కోరారు. దేశం మొత్తం ముస్తాక్ కుటుంబం వైపు చూసేలా ఆదుకోవాలని ఆయన అన్నారు. అయితే.. ముస్తాక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాకపోవడం మాత్రం విచారకరమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.