
సాక్షి, గుడివాడ : ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు కృష్ణా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. పాదయాత్రలో జననేత అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈసందర్భంగా ఆదివారం వైఎస్ జగన్ కౌతవరంలో న్యాయవాదులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్బంగా న్యాయవాదులకు ఆయన పలు హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మండిపడ్డారు.
చివరకు న్యాయవాదులను సైతం నిలువునా వంచించిన చరిత్ర చంద్రబాబుదేనని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. ఈ సమావేశంలో న్యాయవాదులు తమ సమస్యలను జననేతతో ఏకరవు పెట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి పథకాలు, సహాయ సహకారాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను విన్న ఆయన సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్వకేట్లుగా ఎన్‌రోల్ అయినవారికి ఐదు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు.
దీనితో పాటు 100 కోట్ల రూపాయలతో వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైకోర్టు లేదని, ఎక్కడ వస్తుందో చూసి, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో న్యాయవాదులకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తమ సమస్యలను విని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్న వైఎస్ జగన్‌పై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేతకు తమ మద్దతు ఉంటుందన్నారు.