
నేడు వైఎస్ జగన్ రాక
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కేఎన్నార్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఓ ప్రకటన విడుదల చేశారు.
పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కమిటీ సభ్యులు, జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు (కేఎన్నార్) అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన విచ్చేస్తున్నారని వారు పేర్కొన్నారు. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి ఆయన నర్సపూర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం 5.30 గంటలకు గుడివాడ చేరుకుంటారని తెలిపారు. అక్కడ నియోజకవర్గ సమన్వయకర్త కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారని, అనంతరం 8.30 గంటలకు బయలుదేరి కేఎన్నార్ స్వగ్రామమైన మొవ్వ మండలం కోసూరు వెళ్తారని వివరించారు.
కేఎన్నార్ అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం అక్కడినుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని విమానంలో హైదరాబాదు వెళతారని తెలిపారు. జిల్లాలోని పార్టీ శ్రేణులు కేఎన్నార్ అంత్యక్రియల్లో పాల్గొని ఆయనకు ఘన నివాళి సమర్పించాలని వారు కోరారు.