సాక్షి, అమరావతి: కరోనా (కోవిడ్-19) నిర్ధారణ టెస్టులపరంగా చూస్తే మనం దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయం, తాగునీరు, నాడు-నేడు కార్యక్రమాలు, హౌసింగ్, ఉపాధి హామీ, కోవిడ్-19 నివారణా చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి పదిలక్షల జనాభాకు 2500కిపైగా కరోనా టెస్టులు చేస్తున్నామని ఇది ఒక రికార్డు అని అన్నారు. సుమారుగా 35 రోజుల కింద మనకు స్విమ్స్ తప్ప మరో చోట టెస్టింగ్ సౌకర్యం లేదని, అది కూడా రెండు రోజుల తర్వాత ఫలితాలు వచ్చేవని సీఎం జగన్ వివరించారు. ప్రస్తుతం 11 జిల్లాల్లో టెస్టింగ్ సౌకర్యాలు, ట్రూనాట్ కిట్లు కూడా అన్ని ఆస్పత్రుల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. అందరం కలిసి ఈ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకున్నామని సీఎం జగన్ చెప్పారు.
గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్ల రూపంలో మనకు బలమైన నెట్‌వర్క్ ఉందన్నారు. కోవిడ్‌ను ఎదుర్కొనే విషయంలో మనం ఇతర రాష్ట్రాల కన్నా భిన్నంగా పని చేయగలిగామని సీఎం తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలు చక్కటి పని తీరును చూపారని పేర్కొన్నారు. ఎంత చేయాలనుకున్నా కోవిడ్ అనేది ఎక్కడో చోట కనిపిస్తుందని, కోవిడ్‌తో కలిసి జీవించాలన్నది వాస్తవమైన విషయమని సీఎం జగన్ తెలిపారు. దేశంలోనో, రాష్ట్రంలోనో ఎక్కడో ఓ చోట ఇది కనిపిస్తుందని, దగ్గడమో, తుమ్మడమో చేస్తే అది పక్కవాళ్లకు వ్యాపిస్తుందని ఆయన వివరించారు. కరోనా వైరస్ కారణంగా మరణాల రేటు కేవలం 2శాతంలోపే ఉందని, అధిక వయస్సు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపైనే ఎక్కువ ప్రభావం చూపుతోందని చెప్పారు. మన ఇంట్లో ఉన్న పెద్దవారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ తెలిపారు.
ప్రతి గ్రామంలో పది మందికి..
ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులు తిరిగి వస్తున్నారని అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా కొంత మంది వెళ్లడం ప్రారంభమైందని సీఎం జగన్ తెలిపారు. లక్షకు మందికిపైగా రాష్ట్రానికి వలస కూలీలు వస్తారని, మరో లక్షమంది కూడా ఇతరులు ఉంటారని అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు. వివిధ దేశాల నుంచి కూడా మన రాష్ట్రానికి చెందిన వారిని ఆయా దేశాలు పంపుతున్నాయని వెల్లడించారు. వీటన్నింటినీ మనం సమన్వయం చేయాల్సి ఉంటుందని, అందుకనే స్థిరంగా మనం జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామంలో 10 మందికైనా సరిపడే సదుపాయాల్ని కల్పించాల్సి ఉంటుందని, క్వారంటైన్‌లో మంచి బెడ్లు, బెడ్ షీట్లు, దిండ్లు, టాయిలెట్లు, మంచి భోజనం కూడా పెట్టాలన్నారు. క్వారంటైన్ వద్ద శానిటేషన్ వర్కర్లను కూడా పెట్టాలన్నారు. ప్రతి గ్రామంలోనూ ఈ సదుపాయాలు ఉండాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. దాదాపు 11వేలకుపైగా ఉన్న గ్రామసచివాలయాల్లో కనీసం లక్షమందికి క్వారంటైన్ సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సీఎం తెలిపారు.
కలెక్టర్లపైనే బాధ్యత:
ప్రస్తుతం నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ క్వారంటైన్ సదుపాయాలు ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. 25 వేల సింగిల్ రూమ్స్, 7500 డబుల్ రూమ్స్ ఉన్నాయని, ఇందులో 40 వేల మంది వరకూ ఉండవచ్చుని సీఎం జగన్ వెల్లడించారు. ఇవి కాకుండా డార్మిటరీస్ కూడా ఉన్నాయని సదుపాయాలు బాగున్నాయా? లేదా? అన్న విషయాన్ని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష, పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా మన జీవితంలో కొన్ని నెలలపాటు నిరంతరంగా కొనసాగుతుందని అందుకనే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. సదుపాయాలు బాగుంటేనే ప్రజలు అక్కడకు వెళ్లగలుగుతారని అందుకే సదుపాయాలు బాగుండేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉంటుందని సీఎం జగన్ తెలియజేశారు. సదుపాయాలు లేకపోతే కలెక్టర్ మీద మచ్చ పడుతుందని, సిబ్బందిని పెట్టుకుని క్వారంటైన్ సదుపాయాలపై దృష్టిపెట్టి ప్రతిరోజూ సమీక్ష చేయాలని సీఎం జగన్ కలెక్టర్లకు సూచనలు ఇచ్చారు.
టెలిమెడిసిన్:
టెలి మెడిసిన్ కోసం ఒక నంబర్ కేటాయించామని, అలాగే ప్రతి సచివాలయంలో కూడా ముఖ్యమైన నంబర్లు ఉంచుతామని సీఎం జగన్ తెలిపారు. ఈ నంబర్లు ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉండాలని ఆయన సూచించారు. టెలి మెడిసిన్‌కు సానుకూలమైన స్పదన వస్తుందని అధికారులు చెబుతున్నట్లు తెలిపారు. కాల్ చేసిన వారికి ప్రిస్కిప్షన్ ఇచ్చిన తర్వాత ఆ వివరాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితోపాటు, కలెక్టర్‌కూ వస్తాయని సీఎం వివరించారు. ఇక్కడ కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. పీహెచ్‌సీ పరిధిలోకి ఒక ద్విచక్ర వాహనాన్ని, థర్మల్ బాక్సును అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ చెప్పారు. 24 గంటల్లోగా ప్రిస్కిప్షన్ ప్రకారం మందులు వెళ్లాలని, త్వరలో విలేజ్ క్లినిక్ ప్రారంభం అవుతుందని సీఎం జగన్ వెల్లడించారు. టెలీమెడిసిన్ మరింత బలోపేతం అవుతుందని, ఈ వ్యవస్థను కలెక్టర్లు తమదిగా భావించి బాగా పని చేయించాలని సూచించారు.
అలాగే అధికారులు రాష్ట్రంలోని అన్ని కుటుంబాలపై సమగ్రంగా సర్వే చేశారని, ఇంకా 5,281 మందికి పరీక్షలు చేయాల్సి ఉందని సీఎం జగన్ తెలిపారు. వీలైనంత త్వరగా వీరికి పరీక్షలు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించుకున్న కంటైన్‌మెంట్ క్లస్టర్లపై దానిచుట్టూ ఉన్న బఫర్ జోన్‌పై పూర్తి దృష్టిపెట్టాలని సీఎం జగన్ కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. కేసులన్నీ కూడా క్లస్టర్ జోన్ల నుంచే అధిక శాతం వస్తున్నాయని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment